ముహూర్తం పెట్టడమే ఆలస్యం
రుణాల రూపంలో వచ్చి పడుతున్న నిధులు
బడ్జెట్‌కు వెనుకాడని యువతరం
పెళ్లి వేడుక గొప్పగా ఉండాలన్న ఆకాంక్ష
మన సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకోవలాన్న ఆకాంక్ష పెరుగుతోంది. కలిగిన కుటుంబాలు సహజంగానే పెళ్లిళ్లకు ఘనంగా ఖర్చు చేస్తుంటాయి. ఆ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి వివాహానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుండే ఉంటుంది. అంబానీ రేంజ్ కాకపోయినా.. తమ పరిధిలో భారీ బడ్జెట్‌తో వివాహం చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించిన వారు), జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) యువతీయువకులు వివాహం విషయంలో కేవలం తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యంపైనే ఆధారపడాలని అనుకోవడం లేదని ఇండియాలెండ్స్ సర్వేలో వెల్లడైంది. వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకుని, బాలీవుడ్ స్టైల్‌లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ (తమకు నచ్చిన వేరే ప్రాంతంలో)కు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 పట్టణాల పరిధిలో వివాహంపై 1,200 మంది మిలీనియల్స్ అభిప్రాయాలను ఇండియాలెండ్స్ సర్వే తెలుసుకుంది.
42 శాతం మంది తమ వివాహానికి తామే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. ఇందులోనూ 41 శాతం మంది తమ పొదుపు నిధులను వాడుకోవాలని అనుకుంటుంటే.. 26 శాతం మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో 33 శాతం మంది పెళ్లి ఖర్చు విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో లేనట్టు వెల్లడైంది. ఇప్పటికీ 82 శాతం పెళ్లిళ్లు వ్యక్తిగత పొదుపు సొమ్ములతోనే పూర్తవుతుండగా.. ఆస్తులు విక్రయించి 6 శాతం మేర, మరో 12 శాతం పెళ్లి వేడుకలు అప్పులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సర్వే వివరాలతో ‘వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0’ను ఇండియాలెండ్స్ విడుదల చేసింది.
ముందుకొస్తున్న సంస్థలు..
వివాహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం, ఖర్చుకు వెనుకాడని ధోరణి ఈ మార్కెట్లో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీ అవకాశాలు కలి్పస్తున్నాయి. పెళ్లి సంబంధాలకు వేదిక అయిన మ్యాట్రిమోనీ డాట్ కామ్ దీన్ని ముందే గుర్తించి.. వెడ్డింగ్‌లోన్ డాట్ కామ్ పేరుతో ఇటీవలే ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. వివాహం కోసం వధూవరులు లేదా తల్లిదండ్రులు ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో రుణం తీసుకోవచ్చు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌తో ఈ సంస్థ జట్టుకట్టింది.
‘‘అన్‌సెక్యూర్డ్ పర్సనల్ రుణాల్లో 25–30 శాతం మేర వివాహాల కోసమే తీసుకుంటున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. గడిచిన రెండేళ్లలో ఈ డిమాండ్ 20 శాతం మేర పెరిగింది’’అని మ్యాట్రిమోనీ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ ఝా తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ అయితే తనఖా లేకుండానే వివాహ రుణాలు అందిస్తోంది. సులభతర చెల్లింపులతో ఆన్‌లైన్‌లో రుణాలను మంజూరు చేస్తున్నట్టు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు. వెడ్డింగ్‌లోన్ డాట్ కామ్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, పర్సనల్ లోన్స్, రివాల్వింగ్ క్రెడిట్ లైన్ పేరుతో 3 రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అన్నది రుణ గ్రహీత సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది.
పెరిగిపోయిన వ్యయాలు
వివాహాలకు ఖర్చులు పెరిగిపోతుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. 68 శాతం మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు. సగటు వివాహ వేడుక వ్యయం రూ.36.5 లక్షలకు పెరిగినట్టు ‘వెడ్‌మీగుడ్’ అనే వెడ్డింగ్ ప్లానర్ చెబుతోంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం చేసే ఖర్చు రూ.51 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023తో పోలి్చతే ఈ వ్యయాలు 7 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా కల్యాణ మంటపం, క్యాటరింగ్ చార్జీలు 10 శాతం వరకు పెరిగాయి. పెళ్లి ఘనంగా చేసుకునేందుకు నిధుల లోటును అడ్డంకిగా మెజారిటీ యువతరం భావించడం లేదు. రుణాల లభ్యత పెరిగిపోవడమే ఇందుకు కారణం.
మారిన ధోరణి..
గతంలో తెలిసిన వారి వద్ద, స్థానిక రుణదాతల నుంచి వివాహం కోసం అప్పు తీసుకునే వారు. ఇప్పుడు ఈ మార్కెట్ సంఘటితంగా మారి బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వైపు మళ్లుతోంది – ప్రవీణ్ ఖండేల్‌వాల్, సీఏఐటీ వ్యవస్థాపకులు
రూ.15,000 ఆదాయం ఉంటే చాలు..
నెలవారీ రూ.15,000 ఆదాయం ఉన్న వారు సైతం రూ.50,000 నుంచి రూ.40 లక్షల వరకు రుణాలు పొందొచ్చని యాక్సిస్‌బ్యాంక్ అధికారి తెలిపారు. వివాహ రుణాలపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment