సాక్షి, హైదరాబాద్ : గోదావరి బేసిన్‌లో ఎగువ నుంచి కరువైన ప్రవాహాలతో వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు జవసత్వాలు అందించేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కాళేశ్వరం నీటిని తీసుకునే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పాక్షికంగా పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం పనులు జరుగుతుండగా, జూన్ నాటికి చైనా నుంచి మోటార్లు రాష్ట్రానికి చేరుకునేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి ఎస్సారెస్పీ కింద స్టేజ్–1లో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఎన్నడూ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందిన దాఖలాలు లేవు.
దీనికి తోడు ఎస్సారెస్పీలో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా కట్టిన ప్రాజెక్టుల నేపథ్యంలో దిగువకు 54 టీఎంసీలకు మించి నీరు రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించి, గత ఏడాది జూన్‌లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మొత్తంగా మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేయగా, 15 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి
ఈ పనులను గత ఏడాది ఆగస్టులో ఆరంభించగా ఇప్పటికే 30.37 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో 28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో కాంక్రీట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికి రెండు పంప్‌హౌస్‌లను పాక్షికంగా పూర్తి చేసి 0.5 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించినప్పటికీ ప్రస్తుతం పాక్షికంగానే పూర్తయిన నేపథ్యంలో 90 రోజుల్లో 45 టీఎంసీలు, అవసరమయితే 120 రోజుల్లో 0.5 టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళిక రచించారు. ఈ పథకానికి సంబంధించి మూడు పంప్‌హౌస్‌ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం ఉండగా,
ఈ నెలాఖరుకు మొదటి పంప్‌హౌస్‌కు చెందిన మూడు మోటార్లు రాష్ట్రానికి చేరనున్నాయి. రెండో పంప్‌హౌస్‌కు చెందిన మరో మూడు మోటార్లు జూన్ చివరికి రాష్ట్రానికి చేరనున్నాయి. మూడో పంప్‌హౌస్ పనులను మాత్రం డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. మూడో పంప్‌హౌస్ పూర్తి కాకున్నా కనిష్టంగా 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై చివరికల్లా మోటార్ల బిగింపును పూర్తిచేసి ఆగస్టులో ఎల్లంపల్లి నుంచి వరదకాల్వ ద్వారా ఎస్సారెస్పీకి గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment