పకడ్బందీ వ్యూహం.. కారుదే జోరు‌  | Municipal MLC Election TRS Strategy In Nizamabad | Sakshi
Sakshi News home page

పకడ్బందీ వ్యూహం.. కారుదే జోరు‌ 

Published Sat, Oct 10 2020 11:52 AM | Last Updated on Sat, Oct 10 2020 12:07 PM

Municipal MLC Election TRS Strategy In Nizamabad - Sakshi

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కారు జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 823 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. వంద శాతం ఓట్లు పోలయ్యాయి. తమ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమని, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్‌లు కూడా దక్కవని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా, సజావుగా ముగిసింది. కోవిడ్‌–19 నిబంధనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించింది. మొత్తం 824 ఓట్లు ఉండగా ఇటీవల బోధన్‌ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్‌ ఒక్కరు మృతి చెందారు. దీంతో 50 పోలింగ్‌ కేంద్రాల్లో 823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా సోకిన ఓటర్లు చివరి గంటలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓట్లేశారు. ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి గంటలో నామమాత్రంగా ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ ఊపందుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు దాదాపు 98 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సరళిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి నారాయణరెడ్డి పరిశీలించారు. పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన ఆయన అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో వెబ్‌క్యాస్టింగ్‌ను పరిశీలించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. ఈనెల 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పకడ్బందీ వ్యూహంతో.. 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమాలో ఉన్నారు. ఎన్నిక పోలింగ్‌ తేదీని ప్రకటించిన వెంటనే అప్రమత్తమైన అధికార పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కమలం పార్టీకి పట్టున్న నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో కూడా బీజేపీ కార్పొరేటర్లకు గులాబీ రంగు కండువాలు కప్పడం ద్వారా నగర పాలక సంస్థలోనూ టీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తమ అంతరాత్మ ప్రభోదం మేరకు పార్టీలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ను ఆదరించారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా పరిషత్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే సుమారు 90 శాతం ఓట్లు తమ పార్టీ అభ్యర్థి కవితకు వేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. పసుపు రైతులను, జిల్లా ప్రజలను నయవంచన చేసిన పార్టీలకు, నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీలకు మధ్య పోరులో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందన్నారు. 

పోలీసుల తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం.. 
జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచి ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త వెంట వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్‌ సమయంలో ఎమ్మెల్యే బిగాల క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉండటం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీని తరిమికొట్టే సమయం దగ్గర పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంట బీజేపీ అభ్యర్థి పి లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తలు ఉన్నారు. 

కనిపించని కాంగ్రెస్‌ నాయకత్వం.. 
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వలసలతో కాంగ్రెస్‌ పార్టీ  కుదేలైన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలెవరూ పోలింగ్‌ కేంద్రాల వద్ద కనిపించలేదు. అక్కడక్కడ ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ముఖ్యనాయకుల హడావుడి అక్కడక్కడా కనిపించింది. నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు ఓటర్లతో కలిసి వచ్చారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలెవరూ కేంద్రాల వద్ద కనిపించలేదు. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే స్థానిక సంస్థల్లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలెవరూ అటువైపు తొంగి చూడలేదు.

కామారెడ్డిలో వంద శాతం!
సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 341 మంది ఓటర్లు ఉండగా, 339 మంది పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయగా, మిగతా ఇద్దరు సభ్యులు ఆస్పత్రుల్లో ఉండడంతో వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలైంది. కాగా 10 గంటలలోపు కేవలం 12 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3.52 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 193 మంది ఓటు వేయగా, 56.60 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 333 మంది ఓటు వేయగా, 97.65 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటలకు 335 మంది ఓటు వేశారు. 98.24 శాతం పోలింగ్‌ నమోదైంది. 5 గంటల వరకు 339 మంది ఓటు వేయగా, 99.41 శాతం పోలింగ్‌ నమోదైనట్టు కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. గాంధారి, రాజంపేట జెడ్పీటీసీ సభ్యులు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో నూరు శాతం పోలింగ్‌ జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు 
అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ప్రభు త్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీసియో మెంబర్‌గా ఓటు వేశారు. ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే జాజాల సురేందర్, నిజాంసాగర్‌ మండలంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దపేదార్‌ శోభ, బీబీపేట మండలంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేంకుమార్‌ ఓటు వేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, ఎల్లారెడ్డిలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, బాన్సువాడలో చైర్మన్‌ గంగాధర్‌ ఓటు వేశారు. 

భారీ బందోబస్తు 
శాసన మండలి ఎన్నికల సంద ర్భంగా ఎస్పీ శ్వేత పర్యవేక్షణ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి ఆ ధ్వర్యంలో బందోబస్తు నిర్వ హించారు. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాలతో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 

కోవిడ్‌ నిబంధన ప్రకారం ఎన్నికలు 
కామారెడ్డి టౌన్‌: ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లాలో 22 పోలింగ్‌ కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించామని కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల తీరును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రాలలో శానిటైజర్లు, గ్లౌజ్‌లు ఏర్పాటు చేసి ఓటింగ్‌ నిర్వహించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కృషి చేసిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు.

ఓటింగ్‌ సరళిని పరిశీలించిన కవిత 
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సరళిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. కామారెడ్డి, బోధన్‌లోని పోలింగ్‌ కేంద్రాలను ఆమె సందర్శించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్‌ ఆమె వెంట ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement