సాక్షి, నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నిక నేపథ్యంలో ఇందూరులో రాజకీయం వేడెక్కింది. ఈ స్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీచేస్తుండటంతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపునకు కావాల్సిన స్పష్టమైన మేజార్టీ ఉన్నప్పటికీ.. భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకుంటుంది. ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 70శాతానికి పైగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయిన్పటికీ బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీకి పట్టున్న నిజామాబాద్ నగరంలో ఆ పార్టీ కార్పొరేటర్లు సైతం కారెక్కుతున్నారు. ఫిరాయింపులతో 570 వరకు ఉన్న టీఆర్‌ఎస్ బలం.. వలసలతో 645 వరకు పెరిగింది.
తాజాగా సోమవారం నాడు 44వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బైకాన్ సుధ మధు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. గత లోక్‌సభలో ఎన్నికల్లో కవిత ఓటమికి కారణమైన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కక్షసారింపుగానే అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పార్టీ నేతలను కారెక్కకుండా ఆపడం స్థానిక ఎంపీ అర్వింద్‌కు సవాలుగా మారింది. కవిత వేస్తున్న ఎత్తులకు ఏం చేయాలో తెలియక అంతర్మధనం చెందుతున్నారు. కాగా అక్టోబర్ 9 ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి టీఆర్‌ఎస్‌కు మద్దతు దక్కేలా టీఆర్‌ఎస్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. (చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ!)
మంత్రివర్గంలో చేరుతారా?
మరోవైపు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలువగానే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలకమైన శాఖను అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆరేళ్ళ కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది. అంటే కవిత ఎమ్మెల్సీ పదవిలో ఇంకా 15 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. 2016 జనవరి 5న ఈస్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు 20 నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగబోతోంది. తాజా అంచనాలను బట్టి కవిత సులువుగా గెలిచే అవకాశాలున్నాయి. మరి ఆమె మంత్రివర్గంలో చేరుతారా? లేక ఎమ్మెల్సీగానే కొనసాగుతారా? వేచి చూడాల్సిందే.
మరోసారి క్యాంపు రాజకీయాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపించడంతో ఆయా మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను శనివారం క్యాంప్‌నకు తరలించారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తుండడంతో ఆమెకు మద్దతుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌నకు పంపించారు. టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు ఇతర పార్టీ ల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు వెళ్లారు. జిల్లాలోని 27 మండలాల నుంచి ప్రజాప్రతినిధులను హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించారు. మహిళా ప్రజాప్రతినిధులకు తోడుగా వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ ఓట్లు చీలకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా క్యాంపును నిర్వహించనున్నట్లు వెల్లడైతుంది.
మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులతో పాటు మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు, కార్పోరేటర్లను కూడా తరలించినట్లు తెలుస్తుంది. గడిచిన మార్చిలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపును నిర్వహించారు. కాగా కరోనా విజృంభించిన కారణంగా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎత్తివేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన విషయం విదితమే. ఇందులో భాగంగానే ఈ నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో మరోసారి క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment