ఈసీ గ్రీన్ ‌సిగ్నల్‌ : కవిత గెలుపు వ్యూహాలు | EC Green Signal To Nizamabad MLC Election Kavitha Contest | Sakshi
Sakshi News home page

ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ : కవిత గెలుపు కసరత్తు

Published Sat, Sep 26 2020 8:36 AM | Last Updated on Sat, Sep 26 2020 1:52 PM

EC Green Signal To Nizamabad MLC Election Kavitha Contest - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా ఇదివరకు వాయిదా పడిన ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చే నెల 9న జరుగనుంది. మార్చిలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం ఓటర్లలో 75 శాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నందున కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సాక్షి, నిజామాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చిలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం విధితమే. ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది. మొత్తం ఓటర్లలో సుమారు 75 శాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 570 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. కాంగ్రెస్‌ పార్టీకి 152 మంది ఉండగా, బీజేపీ నుంచి 78 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే మరో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్రులు ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న 570 మందితో పాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇటీవల కారెక్కారు. దీనికి తోడు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కవిత గెలుపు ఏకపక్షం కానుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా మొదట్లో ఈ ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మినారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి నామినేషన్లు వేసిన విషయం విధితమే. ఈ ఎన్నికల్లో కవిత విజయంసాధిస్తే తొలిసారి మండలిలోకి అడుగుపెట్టనున్నారు. (అక్టోబర్‌ 9న ఎమ్మెల్సీ ఎన్నిక)

ఉదయం 9 గంటల నుంచి పోలింగ్‌
లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్‌ 9న నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 14లోపు ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా ఈ స్థానానికి ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఇంతలోగా లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో పోలింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ పోలింగ్‌ ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎట్టకేలకు వచ్చే నెల 9న ఈ ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

కరోనా నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు.. 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లను థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే లోనికి అనుమతించాలని ఆదేశించింది. అలాగే ఓటర్లు మాస్కులు ధరించడం, సానిటైజర్లు ఉపయోగించేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేవారు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది కూడా సోషల్‌ డిస్టెన్స్‌ ఉండేలా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. విశాలమైన గదుల్లో పోలింగ్‌ నిర్వహించాలని, పోలింగ్‌ సిబ్బందిని తరలించేందుకు వాహనాల విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అమలులోకి ఎన్నికల కోడ్‌.. 
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధి మొత్తంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement