సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత కల‍్వకుంట్ల ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి. అధికార పార్టీ ఆది నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడలు వేస్తూ ‘కారు’వేగంతో దూసుకెళ్లింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్‌ఎస్ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు 728.. బీజేపీకి 56.. కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.
‘వార్’ వన్‌సైడే..
మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నా పోటీ నామమాత్రంగానే సాగింది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో బలం ఉండటం, దానికి తోడు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిపోయారు. దీంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయా నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఓటర్లను ఈ నెల 3న క్యాంపునకు తరలించింది. ఓటింగ్ రోజు ఉదయం నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించారు.
గులాబీ శ్రేణుల్లో హుషారు..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మాత్రమే కవితకు కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రజలకు సంబంధాలున్నాయి. ఎంపీగా కొనసాగిన సమయంలో కవిత రాజధాని నుంచి నిజామాబాద్ రాకపోకలు సాగించే సందర్భంలో కామారెడ్డిలో తన అనుచరులను కలిసి వెళ్లేవారు. బతుకమ్మ ఉత్సవాల్లో మాత్రమే పాల్గొన్నారు. అయితే, ఈసారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ కావడంతో శాసనమండలి సభ్యురాలిగా జిల్లాలో జరిగే అన్ని కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో భాగం కానున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
విజయోత్సవాలకు సన్నద్ధం..
ఎమ్మెల్సీగా కవిత భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు, నేతలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో విజయోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలై, రెండు గంటల్లో ఫలితం వెలువడింది. కవిత గెలుపును అధికారికంగా ప్రకటించగానే బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకునేందుకు ఆమె అనుచరులు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విజయోత్సవాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు నేతలు సూచించడంతో అన్ని చోట్ల ఏర్పాట్లు చేసుకున్నారు.
మొత్తం 823 ఓట్లు..
- టీఆర్ఎస్‌కు 728 ఓట్లు
- బీజేపీకి 56 ఓట్లు
- కాంగ్రెస్‌కు 29 ఓట్లు..
- చెల్లని ఓట్లు 10
Comments
Please login to add a commentAdd a comment