మృతి చెందిన భవధారణి, కౌసల్యా, మణిమోలీ (ఫైల్)
చెన్నై , అన్నానగర్: విల్లుపురం సమీపంలో ఆదివారం బావిలో మునిగి పాఠశాల విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు. విల్లుపురం సమీపం కక్కనూర్ మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన షణ్ముగం కుమార్తె భవధారణి (11), ఏలుమలై కుమార్తె కౌసల్య (12), మణి కుమార్తె మణిమోలీ (14). వీరు ముగ్గురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అదే ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాల్లో భవధారణి 6వ తరగతి, కౌసల్యా 7వ తరగతి, మణిమోలీ 9వ తరగతి చదువుతున్నారు. ఈ స్థితిలో ఆదివారం సెలవు కావడంతో స్నేహితులైన ముగ్గురు విద్యార్థినులు మధ్యాహ్నం 11 గంటలకు అదే ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు.
వీరితో పాటు మణిమోలీ చెల్లి 6వ తరగతి చదువుతున్న నిత్య (11) వెళ్లింది. మణిమోలి, కౌసల్య, భవధారణి బావిలో దిగి మెట్ల మీద కూర్చొని దుస్తులను ఉతుకుతున్నారు. నిత్య మాత్రం గట్టున నిలబడి ఉంది. ఆ సమయంలో భవధారణి హఠాత్తుగా కాలుజారి నీటిలో పడింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన మణిమోలి, కౌసల్య ఆమెను రక్షించడానికి నీటిలో దూకారు. దీంతో ముగ్గురు నీట మునిగిపోయారు. గట్టున ఉన్న నిత్య కేకలు వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పరుగున వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు ఇరుగుపొరుగు వారితో కలిసి హుటాహుటిన బావి వద్దకు చేరుకుని నీట మునిగిన ముగ్గురిని బయటకి తీశారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన డాక్టర్లు ముగ్గురు విద్యార్థినులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థినులు నీటమునిగి మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment