సాక్షి, చెన్నై: ఇకపై ప్రతి శనివారం కూడా పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవులే. ఈ పరిస్థితుల్లో తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కొంత ఆలస్యమైంది. భానుడి ప్రతాపం పుణ్యమా రెండు సార్లు పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి 6–12 తరగతులకు, ఈనెల 14 వతేదీ నుంచి 1–5 తరగతులకు పాఠశాలలు తెరచుకోనున్నాయి.
అదే సమయంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతోవ ర్షాలు ఆశాజనకంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకడంలో రాష్ట్రంలో అనేక జిల్లాలో తేలిక పాటి వర్షం మొదలైంది. శనివారం చెన్నై , శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. ఈవర్షం ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో పాఠశాలలకు తరచూ సెలవులు ఇవ్వక తప్పదు. దీంతో ఈ సెలవులతో విద్యా బోధనలు కుంటు పడే పరిస్థితి ఉంది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి శనివారం కూడా పాఠశాలలు పనిచేసే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ విషయంగా విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరిశీలన జరుపుతున్నామన్నారు. సకాలంలో సిలబస్ ముగించాలంటే శనివారం కూడా తరగతుల నిర్వహణ అవశ్యమని, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సులను శని, ఆదివారం కూడా నడిపేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment