సందుకో వాటర్ ప్లాంట్.. కూల్‌డ్రింక్ దుకాణాల్లోనూ వాటర్ ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీ బాటిల్ కొని నీళ్లు తాగనిదే కొందరికి గొంతు తడారదు. ఎక్కడికెళ్లినా వాటర్ క్యాన్లను వెంట పెట్టుకుని వెళ్తున్న జనం కోకొల్లలు. ‘స్వచ్ఛత’ ముసుగులో నీటి వ్యాపారం ‘కోట్లు’ దాటుతోంది. ఇలాంటి ఈ రోజుల్లోనూ ఆ ఊరి జనానికి ఓ బావి నీరు అమృతంతో సమానం. ఊళ్లో వాటర్ ప్లాంట్‌లు ఉన్నా, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించినా.. ఆ నీటితోనే గొంతు తడుపుకోవడం చూస్తే ఆ గ్రామానికి బావితో ఉన్న అనుబంధం ఇట్టే అర్థమవుతుంది.
ఆలూరు రూరల్(కర్నూలు జిల్లా): పట్టణాల సంగతి పక్కనపెడితే.. వాటర్‌ప్లాంట్ కనిపించని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. పక్కనే వాగులు, వంకలు పారుతున్నా.. సెలయేళ్లు ఉరుకుతున్నా.. బావులు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అందరి అడుగులు వాటర్‌ప్లాంట్ వద్దే ఆగుతున్నాయి. ఐఎస్‌ఐ మార్కు లేకపోయినా, మినరల్స్ ఏస్థాయిలో ఉంటున్నాయో తెలియకపోయినా.. ప్లాంట్ ముందు ఏర్పాటు చేసిన కుళాయి ముందు బిందెలు బారులు తీరుతున్నాయి. ఐదు, పది రూపాయలు.. మరికొన్ని చోట్ల 20 రూపాయలు వెచ్చించి కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమవుతున్న నీటిని కాదని.. కోరి మరీ రోగాలను కొంటున్నారు. అయితే మండలంలోని మొలగవల్లి గ్రామం ఇప్పటికీ బావి నీటితోనే దాహం తీర్చుకుంటోంది. మినరల్ వాటర్ ప్లాంట్‌లు ఈ గ్రామంలోకి అడుగుపెట్టినా.. తాగునీరు మాత్రం ప్రతి ఇంటికీ ఈ బావి నీరు ఉండాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు శతాబ్దాలుగా ఈ బావి ప్రతి ఇంటికి అమృతం అందిస్తోంది.
ఆ బావి నీళ్లే మినరల్ వాటర్
గ్రామంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉంది. నాలుగు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు నిర్మించారు. 7వేల వరకు ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామస్తులు తాగునీటికి మాత్రం ఆ బావి నీళ్లనే వినియోగిస్తున్నారు. రోజు ఈ నీటిని తాగుతున్న స్థానికులు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నీరు తాగితే ఒళ్లు నొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. ఇక ప్రధానంగా అన్నం, పప్పు వండటానికి ఈ నీళ్లు అయితే బాగా ఉడుకుతాయని, ఇతర ఏ నీళ్లు అయినా సరిగా ఉడకవని, తిన్నట్లుగా కూడా ఉండదంటారు.
పెద్దబావిలోనే.. చేదుడు బావి..
నాలుగు వందల ఏళ్ల క్రితం మొలగవల్లి గ్రామంలోని చెరువు పక్కన గ్రామస్తుల తాగునీటి అవసరాలకు ఓ పెద్ద బావి నిర్మించారు. దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత బావిలో నీరు ఇంకిపోవడంతో అప్పట్లో గ్రామస్తులు చిప్పలతో నీళ్లను తోడుకునే వారని వయసు మళ్లిన వాళ్లు చెబుతుంటారు. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా వందేళ్ల క్రితం పెద్ద బావిలోనే స్థానికులు మరో చేదుడు బావిని తవ్వుకున్నారు. చిన్న బావి నిర్మించుకున్న తర్వాత ఎనిమిదేళ్ల క్రితం నీటిని బయటికి తోడి పెద్దబావిలో పూడిక తొలగించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వారానికి ఒకసారి తాగునీటి బావిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతుంటారు. శుభకార్యాల వేళ గ్రామస్తులు పెద్దబావి వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పెద్దబాయి నీళ్లు అమృతంతో సమానం
నా వయసు 76ఏళ్లు. మా అవ్వతాతల కాలం నుంచి మాకు ఈ బాయి నీళ్లు అమృతంతో సమానం. బయటి నీళ్లు తాగితే కాళ్ల నొప్పులు, దగ్గు, పడిశం వస్తుంది. ఇంక వంట చేయనీక ఈ నీళ్లు అయితేనే బ్యాళ్లు, బియ్యం బాగా ఉడుకుతాయి. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా గంగమ్మకు పూజలు చేయాల్సిందే.
– గౌరమ్మ, వృద్ధురాలు, మొలగవల్లి
బయటి నీళ్లు తాగితే అనారోగ్యం
గ్రామంలో వాటర్‌ప్లాంట్‌లు పెట్టినా, కుళాయిలు ఉన్నా మాకు ఈ బావి నీళ్లు తాగితేనే గొంతు తడారుతుంది. మినరల్ వాటర్ కన్నా ఈ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి నీళ్లు తాగితే ఒంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. గ్రామానికి సరఫరా అవుతున్న నీటిని ఇంటి అవసరాలకు వినియోగిస్తాం.
– శ్రీరాములు, మొలగవల్లి
బావితో మాకు ఎంతో అనుబంధం
మా తాతల కాలం నుంచి ఈ బావితో మాకు అనుబంధం ఉంది. బయటి ప్రాంతాల్లో చిన్న వయస్సుకే మోకాళ్ల నొప్పులు, ఆ రోగం, ఈ రోగం అంటుంటారు. మాకు మాత్రం ఈ నీళ్లు తాగితే ఏ నొప్పులు ఉండవు. వ్యాపారం కోసం మినరల్ వాటర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేసినా మేము మాత్రం బావి దగ్గరకు పోయి నీళ్లు తెచ్చుకునేందుకే ఇష్టపడతాం.
– రామాంజినేయులు, మొలగవల్లి
Comments
Please login to add a commentAdd a comment