గుమిగూడిన జనం (ఇన్‌సెట్) నీటిని తోడేందుకు బావి వద్ద ఏర్పాటు చేసిన మోటారు
కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల: బంగారంతో తయారు చేసిన పీర్లు బావిలో ఉన్నట్లు ఓ యువకుడికి తరచూ కల వస్తోంది. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఒకవేళ అది నిజం కావచ్చేమోనని..బావిలో నీరు తోడుతున్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో పురాతన బావి ఉంది. అందులో బంగారంతో చేసిన చిన్నకాశీం, పెద్ద కాశీం, దస్తగిరిస్వామి పీర్లు ఉన్నాయని గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడికి తరచూ కల వస్తోందట! ఆలయం వెనుక భాగంలో వందల ఏళ్ల క్రితం పాత ఊరు(కొత్తకోట అనే గ్రామం) ఉండేది. అక్కడే ఈ పురాతన బావి ఉండటంతో ఆ యువకుడికి వచ్చిన కల నిజం కావచ్చేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు.
దీంతో వారం రోజుల నుంచి బావి వద్దకు చేరి పీర్ల కోసం అన్వేషిస్తున్నారు. మూడు రోజుల పాటు వరుసగా రాత్రి, పగలూ బావిలోకి దిగి శతవిధాలా ప్రయత్నం చేశారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా డీజిల్ ఇంజిన్ సాయంతో పంపింగ్ చేస్తున్నారు. బావిలో ఊట కారణంగా నీళ్లు తగ్గుముఖం పట్టడం లేదు. పదుల సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే వచ్చే గురువారం వచ్చి ప్రయత్నిస్తే తప్పక పీర్లు బయట పడుతాయని యువకుడు చెప్పడంతో ప్రస్తుతం నీటిని పంపింగ్ చేయడం నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment