బీజింగ్: భారత్‌లో బోరు బావుల్లో పడిపోయిన పిల్లలను రక్షించడం ఎంత కష్టమో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో చాలా తక్కువ సార్లు మాత్రమే పిల్లలు ప్రాణాలతో బయటకు వస్తుంటారు. చైనాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటనే జరగడంతో ఓ స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల మైనర్ బాలుడు సాహసించి మూడేళ్ల పాపను రక్షించారు. చైనా, హెనన్ రాష్ట్రంలోని జెన్ కౌంటీలో మిస్టర్ జావో అనే ఓ వ్యక్తి తన మూడేళ్ల పాపను ఓ ఫుడ్ కోర్టు పక్కనుంచి నడిపించుకుంటూ పోతుంటే తెరచి ఉన్న బోరు బావిలోకి పడిపోయింది. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసిన ఆ తండ్రి, తన కూతురిని కాపాడమని కేకలు వేశారు.
ఈ వార్త తెల్సిన అనతికాలంలోనే చైనా పోలీసులు ప్రమాద స్థలికి వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను, అనుసంధాన పైపులను తీసుకొచ్చి ముందుగా ఆ బోరు బావిలోకి ఆక్సిజన్‌ను పంపించడం మొదలు పెట్టారు. వంద అడుగుల లోతుగల ఆ బావి మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలికను ఎలా వెలికి తీయాలో పోలీసులకు తెలియలేదు. ఎవరైనా బక్క పలుచగా ఉన్న వ్యక్తిని తల కిందులుగా పంపిస్తే తప్పా, ఆ పాపను రక్షించలేమని వారు చెప్పారు. తనను అలా పంపించమంటూ ఆ పాప తండ్రి జావో ముందుకొచ్చారు.
అయితే ఆ బోరు బావి వెడల్పు కేవలం ఎనిమిది అంగుళాలు మాత్రమే ఉందని, ఆయన్ని పంపించడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. అంతలో ప్రమాద స్థలికి వచ్చిన వాంగ్ క్వింగ్‌జున్ అనే వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడైన వాంగ్‌మిన్ రన్ అందుకు సమర్థుడంటూ అతన్ని పిలిపించారు. మైనర్ బాలుడి ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని, అది నేరం అవుతుందని పోలీసులు వద్దన్నారు. తన కుమారుడు సమర్థుడు, సాహసవంతుడని, ఏ ప్రమాదం జరిగినా అందుకు తానే బాధ్యత వహిస్తానని ఆ తండ్రి హామీ ఇవ్వడం, అదే సమయంలో బోరు బావిలో పడిపోయిన పాప అరుపులు ఆగిపోవడంతో బాలుడి సహాయం తీసుకోవడానికి పోలీసులు ముందుకు వచ్చారు.
మినరన్‌కు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పి తల కిందులుగా లోపలికి పంపించారు. లోపలికి వెలుతున్నప్పుడు దారి మరీ సన్నగా ఉండడంతో బాలుడిని బయటకు తీయాల్సి వచ్చింది. బాలుడు చెప్పిన సమాచారం ఆధారంగా బోరు బావిని పైనుంచి లోపల వెడల్పు చేశారు. నాలుగోసారి బాలుడిని పంపించినప్పుడు పాప చేయి బాలుడి చేతికందింది. ‘అన్నా నన్ను కాపాడు అంటూ ఆ పాప నా చేయి పట్టుకుంది. కాపాడడానికే వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, గుండెల నిండా ఆక్సిజన్ పీల్చుకోవడానికి మరోసారి బయటకు వచ్చాను. ఆరో ప్రయత్నంలో ఆ పాపను బయటకు తీసుకురాగలిగాను’ తన అనుభవాన్ని ఆ బాలుడు మీడియాతో పంచుకున్నాడు. పాప ప్రాణాలను కాపాడినందుకు ఎంతో అనందంగా ఉందన్నాడు. అక్కడున్న వారంతా ఆ బాలుడిని, ఆ బాలుడి తండ్రిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment