బోరుబావి నుంచి బాలికను బయటకు తీస్తున్న యువకులు (ఇన్‌సెట్‌లో) చిన్నారి మోక్షిత (ఫైల్)
విడవలూరు/ నెల్లూరు (పొగతోట)/ కోవూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని బోరుబావి మింగేసింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డను చూసి మురిసిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. బోరుబావిలో ఇద్దరు పిల్లలు పడిపోగా.. 3 గంటల పాటు స్థానికులు, అధికారులు కృషి చేసి ఒక్కరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఈ విషాద సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని పెదపాళెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎల్లంగారి ఈశ్వరయ్య, నాగమ్మల కుమార్తె మోక్షిత (3), పామంచి తాతయ్య, పోలమ్మల కుమారుడు పామంచి గోపిరాజు (3) ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న పాఠశాల వద్దకు వెళ్లారు. అయితే పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం దగ్గరలోని ఖాళీ స్థలంలో 16 అడుగులమేర బోరుబావిని తవ్వారు. దీన్ని గమనించని చిన్నారి మోక్షిత మొదట ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది.
ఆ వెంటనే గోపిరాజు కూడా బోరుబావిలో పడ్డాడు. దీనిని గమనించిన మోక్షిత తండ్రి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. అక్కడే పనులు చేస్తున్న యువకులు వెంటనే జేసీబీ సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పక్క ఊరిలోనే పర్యటిస్తున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తొలుత బాలుడు గోపిరాజును సురక్షితంగా బయటకు తీశారు. మోక్షిత లోపల ఉండడంతో బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కొన ఊపిరితో ఉన్న బాలికను వెంటనే 108 వాహనంలో రామతీర్థంలోని ప్రాథమిక వైద్యశాలకు.. అక్కడి నుంచి కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ గ్రామం శోకసంద్రంగా మారింది.
బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం
ఈ సంఘటనను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి వెంటనే సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అలాగే తన సొంత నిధుల నుంచి మోక్షిత కుటుంబానికి రూ. 50 వేలు, బాలుడికి రూ. 50 వేలు, చిన్నారులను కాపాడేందుకు సాహసం చేసిన
స్థానిక యువకులు చిరంజీవి, ప్రసాద్‌లకు మరో రూ. 50 వేలు అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే కలెక్టర్ శేషగిరిబాబు తక్షణ సహాయం కింద ఆర్డీవో చిన్నికృష్ణ ద్వారా రూ. 25 వేలు మోక్షిత కుటుంబసభ్యులకు అందచేశారు.
కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే
చిన్నారులను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రతి క్షణం సహాయక చర్యలను పర్యవేక్షించారు. మోక్షిత మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే బోరుబావులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment