చందు
కృష్ణా, వినుకొండ: ఆడుకుంటున్న బాలుడు బోరుబావిలో పడి మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన సంఘటన జరిగి అప్పుడే ఏడాది పూర్తయింది. పది గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం టీవీల ముందు కూర్చుని బాలుడు ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో జరిగిన ఈ ఘటనలో బాలుడిని రక్షించేందుకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు సంఘటనాస్థలికి చేరుకుని శ్రమించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం, స్థానిక పోలీసులు, ప్రజల సాయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ వేగంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా బోరుబావిలో పడ్డ బాలుడు (అప్పట్లో బాలుడి వయసు ఏడాదిన్నర) ప్రాణాలతో బయటపడ్డాడు. జిల్లా అధికార యంత్రాంగం దాదాపు పది గంటలపాటు కష్టపడి 15 అడుగుల మేరకు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి బాలుడిని సజీవంగా బయటికి తీసుకొచ్చారు. అనుములమూడి మల్లికార్జునరావు, అనూష దంపతుల కుమారుడు చంద్రశేఖర్ (చందు) ఇప్పుడు అంగన్‌వాడీ పాఠశాలకు వెళుతున్నాడు. తమ బిడ్డ తమ ముందు తిరుగాడుతున్నాడంటే అధికారులు పడ్డ కష్టమేనని ఆ బాలుడి తల్లిదండ్రులు నిత్యం గుర్తుచేసుకుంటున్నారు.
అమలుకాని ముఖ్యమంత్రి హామీ
రెండు తెలుగురాష్ట్రాల్లో బోరుబావి నుంచి బయటపడ్డ మొట్టమొదటి బాలుడు చందు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చందుకి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం చంద్రబాబు సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని చందుతో ఫొటోలు దిగి బాలుడి భవిష్యత్ కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment