బోరు మింగేసింది.. | Girl who fell into open borewell pulled out dead | Sakshi
Sakshi News home page

బోరు మింగేసింది..

Published Mon, Jun 26 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

బోరు మింగేసింది..

బోరు మింగేసింది..

బోరుబావిలో పడిన చిన్నారి మృతి
► మూడు రోజుల శ్రమకు దక్కని ఫలితం.. బయటపడని మృతదేహం
► ఎయిర్‌ ఫ్లషింగ్‌ ప్రక్రియతో దుస్తులు, పలు అవయవ అవశేషాలు బయటకు
► చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి..తల్లిదండ్రులకు అప్పగింత
►  వికారాబాద్‌ జిల్లాలోని గోరేపల్లి గ్రామంలో ముగిసిన అంత్యక్రియలు  


చేవెళ్ల/మొయినాబాద్‌/యాలాల: జరగరానిదే జరిగిపోయింది. నోరు తెరిచిన బోరుబావికి మరో చిన్ని ప్రాణం బలైపోయింది. తల్లిదం డ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరుబా విలో పడిపోయిన చిన్నారి (18 నెలలు) మృతి చెందింది. పాపను కాపాడేందుకు అధికార యంత్రాంగం దాదాపు 60 గంటలపాటు చేసిన ప్రయత్నం విఫలమైంది.

చివరకు ఎయిర్‌ ఫ్లషింగ్‌ చేయడంతో ఆదివారం ఉదయం చిన్నారి దుస్తులు, కొన్ని అవయవాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఫ్లషింగ్‌ సమయంలో దుర్వాసన సైతం వచ్చింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి స్వగ్రామమైన వికారాబాద్‌ జిల్లాలోని గోరేపల్లిలో అంత్యక్రియలు జరిగాయి.

ఆశలు వదులుకొని...
బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కను గొనేందుకు ముంబై నుంచి తెప్పించిన అత్యాధునిక మ్యాట్రిక్స్‌ వాటర్‌ ప్రూఫ్‌ కెమె రాను బోరుబావిలోకి వదిలి అన్వేషించారు. 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించే ఈ కెమెరాతో 210 అడుగుల లోతు వరకు చూసినా పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీం తో శనివారం అర్ధరాత్రి అధికార యంత్రాం గం పాపపై ఆశలు వదులుకొని చివరి ప్రయ త్నం చేయాలని నిర్ణయించింది. పాప బోరు బావిలో పడినప్పుడు 40 అడుగుల లోతులోనే ఉంది.

శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటర్‌ను బలంగా బయటకు తీయడంతో అక్కడే అంచులకు పాప అతుక్కుపోయి ఉంటుందని... 40 అడుగుల కిందకు బోర్‌వెల్‌ డయా 6 అంగుళాలే ఉంటుందని.. పాప లోపలికి పడిపోయే అవకాశం ఉండదని బోర్‌వెల్స్‌ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చ న్నగారి లక్ష్మారెడ్డి అధికారులకు చెప్పారు. దీంతో 50 అడుగుల లోతులో బోరును బ్లాక్‌ చేసి పైనుంచి తవ్వకాలు చేపట్టారు. 40 అడు గుల వరకు బోరుబావిని పూర్తిగా పెకిలించి పాపను బయటకు తీయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజాము వరకు 32 అడుగుల వరకు తవ్వకాలు జరిపారు.

సీసీ కెమెరాలతో మరోసారి అన్వేషించి...
బోరుబావిని 32 అడుగుల లోతు వరకు పూర్తిగా తవ్విన క్రమంలో మెదక్‌ జిల్లాకు చెందిన బోర్‌ మెకానిక్‌  శ్రీనివాస్‌ తన వద్ద ఉన్న పరికరాలతో అక్కడికి చేరుకున్నారు. అధికారులు తవ్వకాలు నిలిపేసి అతనికి అవకాశం ఇవ్వడంతో 180 అడుగుల లోతు వరకు సీసీ కెమెరాలను పంపి చూశారు. పాప ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బోర్‌వెల్‌ పైపును 260 అడుగుల లోతు వరకు దింపి ఎయిర్‌ ఫ్లషింగ్‌ చేశారు. ఈ క్రమంలో బోరులోంచి నీళ్లతోపాటు చిన్నారి బట్టలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత పాప అవయవాలకు సంబంధించి కొన్ని అవశేషాలు బయటకు రాగా వాటిని బకెట్‌లో వేసుకొని బయటకు తీశారు.

ప్రయత్నం ఫలించలేదు: మహేందర్‌రెడ్డి
బోరుబావిలో పడిన చిన్నారిని బతికించాలని మూడు రోజులపాటు ప్రయత్నించినా సాధ్యంకాలేదని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పాప శరీర అవశేషాలు బోరుబావిలో నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాప మొదట్లో 40 అడుగుల లోతులో మోటర్‌పై ఉందని... మోటర్‌ను బయటకు తీయడంతో మరింత దిగువకు పడిపోయిందన్నారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాగా, బోరుబావిలో పడిన చిన్నారిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కదలికలు లేవని నిర్ధారణకు వచ్చాకే మోటర్‌ను బయటకు లాగామని జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు.

చిన్నారికి కన్నీటి వీడ్కోలు
బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారికి వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం గోరేపల్లి గ్రామంలో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తు లు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 9.05 గంటలకు అంబులెన్సులోంచి చిన్నారి అవశేషాలున్న పెట్టెను గ్రామానికి తీసుకురాగా తల్లిదండ్రులు యాదయ్య, రేణుక దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దపెట్టున రోదించారు. అనంతరం 10.15 గంటలకు చిన్నారిని ఖననం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement