
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు టోర్నీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్‌పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్‌గా ఉంది.
ముల్లాన్‌పూర్‌తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్‌పూర్‌లలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, రాయ్‌పూర్‌లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు.
» అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
» ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి.
» ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు.
» భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment