నిజామాబాద్ అర్బన్ : అమ్మా ఆకలేస్తోంది.. పాలు కావాలంటూ చిన్నారులు మారం చేశారు. పిల్లలకు పాలు తాగించేందుకు తల్లి సిలిండర్ వెలిగించింది.. మంటలు చెలరేగి ఐదేళ్ల పాప మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు, భార్యభర్తలు గాయాల పాలయ్యారు.
వివరాల ప్రకారం.. పాల వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన సునీల్‌యాదవ్, ధన్వంతరిబాయి దంపతులు నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని సారంగాపూర్ డెయిరీ ఫారం వద్ద ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు బబ్లూ, జగ్గు, నమ్కిబాయి (5) ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి బబ్లూ, జగ్గు పాలుతాగుతామని తల్లిని అడిగారు. తల్లి మినీ సిలిండర్ పై పాలను వేడి చేస్తోంది.
సిలిండర్‌కు చెందిన గ్యాస్ పైపులైన్ స్టౌవ్ వద్ద మంటలు అంటుకొని తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముగ్గురు పిల్లలకు అంటుకున్నాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న భార్యభర్తలు పిల్లలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నమ్కిబాయి చికిత్స పొందుతూ మరణించింది. మిగితా ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment