► 14 నెలల చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్
► టైరు కిందపడి దుర్మరణం
► మేడ్చల్ మండలం లింగాపూర్‌లో విషాదం
మేడ్చల్ : అప్పటివరకు తన అల్లరితో తల్లిదండ్రులను మురిపించిన ఆ చిన్నారి అంతలోనే మృత్యుఒడికి చేరుకుంది. ట్రాక్టర్ చక్రం కిందపడి దుర్మరణం పాలై కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మండల పరిధిలో లింగాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సంజీవకు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన మహేష్ నడిపిస్తున్నాడు.
మహేష్ తన భార్య లక్ష్మి, కూతురు(14నెలలు)తో కలిసి సంజీవ ఇంట్లోనే ఉంటున్నారు. మహేష్ ఆదివారం ఉదయం తన కూతురిని కొద్దిసేపు ఆడించి పనినిమిత్తం ట్రాక్టర్‌తో బయటకు వెళ్లేందుకు పాపను ఇంట్లో తన భార్యకు ఇచ్చాడు. ట్రాక్టర్‌ను స్టార్ట్ చేస్తుండగా పాప బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తండ్రిని చూస్తూ ట్రాక్టర్ వైపునకు వచ్చింది. ఈ విషయం గమనించని మహేష్ ట్రాక్టర్‌ను వెనుకకు పోనిచ్చాడు. టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది.
వాహనం ఎందుకు జరగడం లేదని మహేష్ ట్రాక్టర్ కిందికి దిగి చూడగా చక్రం కింద తన కూతురు పడిఉంది. వెంటనే ట్రాక్టర్‌ను ముందుకు తీసి చిన్నారిని ఓ కారులో నగర శివారులోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే పాప చనిపోయిందని నిర్ధారించారు. అప్పటి వరకు అల్లరి చేసిన చిన్నారి అంతలోనే ప్రమాదం జరిగి కానరాని లోకాలకు వెళ్లడంతో మహేష్, లక్ష్మి దంపతులు గుండెలుబాదుకుంటూ రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా తల్లి.. అంటూ లక్ష్మి రోదించిన తీరు హృద య విదారకం. అనంతరం చిన్నారి మృతదేహాన్ని మహేష్ దంపతులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఆ మురిపాలు ఇకలేవు..
Published Sun, May 17 2015 11:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement