హైదరాబాద్: మెడికల్ రంగంలో ఓ అరుదైన ఘటన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో చోటు చేసుకుంది. ఎంతో అనుభవం గల డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల గర్భం నుంచి ఒక శరీరం.. రెండు తలల శిశువును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఇలా ఒకే శరీరం రెండు తలలతో ఉండటాన్ని వైద్య పరిభాషలో బైసెఫాలిక్ హైడ్రో సెఫాలస్ అని పిలుస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం సూరారం గ్రామానికి చెందిన మహేశ్, సుజాతలకు 2018 జూన్ 17న వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని పార్శిగుట్టలో ఉంటున్నారు. మహేశ్ డ్రైవర్ కాగా, సుజాత గృహిణి. సుజాత గర్భం దాల్చడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని డంగోరియా ఆస్పత్రిలో డాక్టర్ సాయిలీలా దగ్గర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడో నెలలో స్కానింగ్ చేసుకోవాలని సూచించినా కుదరకపోవడంతో చేయించుకోలేదు. ప్రస్తుతం ఐదో నెల కావడంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గురువారం డాక్టర్ దగ్గరికి వెళ్లారు.
అక్కడి నుంచి శివాని స్కానింగ్ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. శిశువు పరిస్థితి చూసి అవాక్కయిన స్కానింగ్ సెంటర్ వారు.. డంగోరియా ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. దీంతో రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ చేసి తల్లి గర్భం నుంచి శిశువును బయటకు తీయాలని, లేకుంటే తల్లి ప్రాణానికే ముప్పు ఉందని చెప్పడంతో శనివారం ఆపరేషన్ చేసి ఆ శిశువును బయటకు తీశారు. కాగా, రెండు తలలతో ఉన్న ఈ శిశువు రెండు చేతులు, రెండు కాళ్లతో మిగతా శరీరం మొత్తం మాములుగానే ఉంది. మెడ మీదనే రెండు తలలు ఉన్నాయి. మగ శిశువుగా గుర్తించారు. గుండె సమస్యతో పాటు రెండు తలలో వాటర్ ఫాం అయ్యింది. గర్భంలోనే శిశువు మరణించి ఉంది. శిశువు వయసు 22 వారాలు ఉంటుంది. 38 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నా ఇలాంటి కేసు తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని డాక్టర్ సాయిలీలా, డంగోరియా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దేవయాని ‘సాక్షి’కి తెలిపారు.
రెండు తలలతో శిశువు
Published Sun, Apr 21 2019 2:40 AM | Last Updated on Sun, Apr 21 2019 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment