సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు.
ఒకటి,రెండు రోజుల్లోనే..!
కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ క్లిప్పు ఆధారమవుతుందా..?
శిశువు బొడ్డును కత్తిరించినపుడు ఆస్పత్రుల్లో క్లిప్ పెడతారు. సెప్టిక్ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది..
బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
వదిలిపెట్టం..
ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.
– వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment