కోల్‌కతా: స్మార్ట్ కొనుక్కునే స్తోమత లేక 16 ఏళ్ల అమ్మాయి చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఆమె రక్తాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్ఘాట్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన సోమవారం జరిగింది.
సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లింది. అయితే ఎవరి కోసమే రక్తాన్ని తీసుకెళ్లేందుకు ఆమె వచ్చి ఉంటుందని వారు అనుకున్నారు. కానీ రక్తం అమ్ముకోవడానికి అక్కడికి వచ్చినట్లు బాలిక చెప్పగానే వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా.. సోదరుడి చికిత్సకు డబ్బులు లేవని, అందుకే రక్తం విక్రయించాలనుకున్నట్లు బాలిక చెప్పింది.
అయితే సిబ్బంది మాత్రం అందుకు నిరాకరించారు. వెంటనే చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించగా.. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. స్మార్ట్‌పోన్ కొనుక్కునేందుకు తన దగ్గర డబ్బులు లేవని, అందుకే రక్తం అమ్ముకోవాలనుకున్నట్లు ఒప్పుకుంది. కౌన్సిలింగ్ అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది.
అయితే ఈ బాలిక ఆదివారం రోజే బంధువు మొబైల్ పోన్ ద్వారా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ పెట్టింది. దాని ఖరీదు రూ.9,000. గురువారం అది ఆమె చేతికి రానుంది. అయితే అందుకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో రక్తం అమ్ముకోవాలనుకుంది. అంతేకాదు ఇంట్లో ట్యూషన్‌కు వెళ్లొస్తానని చెప్పి తాపన్ ప్రాంతం నుంచి బస్సులో 30కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. సైకిల్‌ను కూడా బస్టాండ్‌లోనే వదిలిపెట్టింది.
కూతురు ఇంటి నుంచి వెళ్లినప్పుడు తాను ఇంట్లో లేనని తండ్రి కుమార్ దాస్ తెలిపారు. ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని వాపోయాడు. తనకు నాలుగో తరగతి చదివే కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. కుమార్ దాస్ కూరగాయల వ్యాపారి కాగా.. ఆమె భార్య గృహిణి.
చదవండి: కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment