పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్‌ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.
సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్‌ఘాట్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన మజుందార్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు.
బాలూర్‌ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్‌సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment