రక్త నిధి.. ఏదీ? | Central directorate Drugs From License to delay decisions | Sakshi
Sakshi News home page

రక్త నిధి.. ఏదీ?

Published Sun, Feb 22 2015 3:58 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

రక్త నిధి.. ఏదీ? - Sakshi

రక్త నిధి.. ఏదీ?

- జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన  
- సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ జారీలో జాప్యం
- సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోని ప్రజాప్రతినిధులు
- నెలకు 30 నుంచి 40 కేసులు హైదరాబాద్‌కు రెఫర్
తాండూరు: తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూ వస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కోసం 2012 డిసెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎయిర్ కండీషన్లతోపాటు బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన సుమారు రూ.40లక్షల విలువైన మెటీరియల్‌ను ఎంఎస్‌ఐడీసీ (మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్) తాండూరుకు పంపించింది. ఈ మెటీరియల్ అప్పటి నుంచి స్టోర్‌రూంలోనే మగ్గుతోంది. దాదాపు రెండేళ్లు దాటినా రక్తనిధి కేంద్రం అందుబాటులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సందర్శించి సాధ్యమైనంత తొందరలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తెస్తామని మాటిచ్చారు. అయితే సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు లెసైన్స్ జారీ కావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఈ కారణం వల్లే బ్లడ్ బ్యాంకు ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. అయితే లెసైన్స్ వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదనే ఆరోపణలున్నాయి.   జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా 300పైగా కాన్పులు, 107 సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ఆర్థోపెడిక్ కేసులు కూడా అధికంగానే వస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే మహిళల్లో చాలామందికి రక్తహీనత సమస్య ఉంటోంది. అటువంటి వారి బంధువులు వికారాబాద్ లేదా హైదరాబాద్‌కు వెళ్లి రక్తాన్ని తీసుకువస్తున్నారు. లేదంటే దాతల నుంచి సేకరిస్తున్నారు.

హైదరాబాద్‌కు వెళ్లి రావడానికి సమయం పడుతోందని, ఒక్కోసారి అక్కడ కూడా సరైన వ్యవధిలో లభ్యంకాక ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో వైద్యులు రోగులును హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. నెలకు సుమారు 30 నుంచి 40 కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పెద్ద ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
 
ఇంకా లెసైన్స్ రాలేదు:
డా.వెంకటరమణప్ప, ఆస్పత్రి సూపరింటెండెంట్
జిల్లా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు అంతా సిద్ధం చేశాం. మెటీరియల్‌తోపాటు ప్రత్యేక గది కూడా ఉంది. సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ రావాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే మెటీరియల్ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement