సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి..
డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్‌లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు.
నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్‌ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు.
రూ.700కు కొని రూ.3,800కు విక్రయం
తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్‌టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్‌ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్‌లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment