MSIDC
-
రూ.100 కోట్ల దోపిడీ అవాస్తవం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సరఫరాలో రూ.100 కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ( ఏపీ ఎంఎస్ఐడీసీ) ఎండీ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆస్పత్రులకు మందుల కొనుగోళ్లలో గోల్మాల్’ శీర్షికన ఈనాడు పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. మందులను మార్కెట్ ధర కంటే 500% పైగా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు. రెండేళ్లలో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్ల ద్వారా గానీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ద్వారా గానీ ఇప్పటివరకూ ఎటువంటి చెల్లింపులు చేపట్టలేదన్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించనప్పుడు రూ.100 కోట్ల మేర దోపిడీ జరిగిందని రాయడం సరికాదన్నారు. డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు 20 శాతం సబ్సిడీకి గాను గతంలో ఔషధాలు కొనుగోలు చేసేవారనీ, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావటంతోపాటు కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని గ్రహించి సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. టెండర్లో పెట్టిన నిబంధన ప్రకారమే మందులను కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. అతి తక్కువ రేట్లకే.. అత్యవసర మందుల సరఫరాలో జాప్యాన్ని అధిగమించడం కోసం రెండేళ్ల కాలపరిమితితో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించి మరీ అతి తక్కువ రేట్లకు మందులు సరఫరా చేసే ఏజెన్సీని గుర్తించామన్నారు. సరఫరాదారుడి అన్ని బిల్లులను డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిశీలన తర్వాత, వారు నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా బిల్లుల చెల్లింపులు ఉంటాయన్నారు. నిబంధనల ప్రకారం సరఫరాదారుడు జనరిక్ మందులను, బ్రాండెడ్ మందులను, కేంద్ర ప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ మందులను ఒకే రాయితీ రేట్లకు సరఫరా చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ మందులలో 60 శాతానికి పైగా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ వారి ఆధీనంలో ఉండేవేనన్నారు. వీటి గరిష్ట రిటైల్ ధరలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయని వివరించారు. మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకునే చెల్లింపులు చేస్తామని తెలిపారు. టెండర్ ఎంపికలో ఎటువంటి మతలబు జరగలేదని, సరఫరాదారుడుకి స్థాయి ఉండాలనే ఉద్దేశంతోనే రూ.10 కోట్లుగా నిర్ణయించామన్నారు. -
రక్త నిధి.. ఏదీ?
- జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన - సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ జారీలో జాప్యం - సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోని ప్రజాప్రతినిధులు - నెలకు 30 నుంచి 40 కేసులు హైదరాబాద్‌కు రెఫర్ తాండూరు: తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కోసం 2012 డిసెంబర్లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎయిర్ కండీషన్లతోపాటు బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన సుమారు రూ.40లక్షల విలువైన మెటీరియల్‌ను ఎంఎస్ఐడీసీ (మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్) తాండూరుకు పంపించింది. ఈ మెటీరియల్ అప్పటి నుంచి స్టోర్‌రూంలోనే మగ్గుతోంది. దాదాపు రెండేళ్లు దాటినా రక్తనిధి కేంద్రం అందుబాటులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సందర్శించి సాధ్యమైనంత తొందరలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తెస్తామని మాటిచ్చారు. అయితే సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు లెసైన్స్ జారీ కావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణం వల్లే బ్లడ్ బ్యాంకు ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. అయితే లెసైన్స్ వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా 300పైగా కాన్పులు, 107 సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ఆర్థోపెడిక్ కేసులు కూడా అధికంగానే వస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే మహిళల్లో చాలామందికి రక్తహీనత సమస్య ఉంటోంది. అటువంటి వారి బంధువులు వికారాబాద్ లేదా హైదరాబాద్‌కు వెళ్లి రక్తాన్ని తీసుకువస్తున్నారు. లేదంటే దాతల నుంచి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి రావడానికి సమయం పడుతోందని, ఒక్కోసారి అక్కడ కూడా సరైన వ్యవధిలో లభ్యంకాక ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో వైద్యులు రోగులును హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. నెలకు సుమారు 30 నుంచి 40 కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పెద్ద ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇంకా లెసైన్స్ రాలేదు: డా.వెంకటరమణప్ప, ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు అంతా సిద్ధం చేశాం. మెటీరియల్‌తోపాటు ప్రత్యేక గది కూడా ఉంది. సెంట్రల్ డెరైక్టరేట్ డ్రగ్స్ నుంచి లెసైన్స్ రావాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే మెటీరియల్ వచ్చింది.