సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సరఫరాలో రూ.100 కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ( ఏపీ ఎంఎస్‌ఐడీసీ) ఎండీ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆస్పత్రులకు మందుల కొనుగోళ్లలో గోల్‌మాల్’ శీర్షికన ఈనాడు పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. మందులను మార్కెట్ ధర కంటే 500% పైగా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు.
రెండేళ్లలో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్ల ద్వారా గానీ, ఏపీ ఎంఎస్‌ఐడీసీ ద్వారా గానీ ఇప్పటివరకూ ఎటువంటి చెల్లింపులు చేపట్టలేదన్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించనప్పుడు రూ.100 కోట్ల మేర దోపిడీ జరిగిందని రాయడం సరికాదన్నారు. డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు 20 శాతం సబ్సిడీకి గాను గతంలో ఔషధాలు కొనుగోలు చేసేవారనీ, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావటంతోపాటు కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని గ్రహించి సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. టెండర్‌లో పెట్టిన నిబంధన ప్రకారమే మందులను కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.
అతి తక్కువ రేట్లకే..
అత్యవసర మందుల సరఫరాలో జాప్యాన్ని అధిగమించడం కోసం రెండేళ్ల కాలపరిమితితో ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో రివర్స్ టెండరింగ్ నిర్వహించి మరీ అతి తక్కువ రేట్లకు మందులు సరఫరా చేసే ఏజెన్సీని గుర్తించామన్నారు. సరఫరాదారుడి అన్ని బిల్లులను డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిశీలన తర్వాత, వారు నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా బిల్లుల చెల్లింపులు ఉంటాయన్నారు.
నిబంధనల ప్రకారం సరఫరాదారుడు జనరిక్ మందులను, బ్రాండెడ్ మందులను, కేంద్ర ప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ మందులను ఒకే రాయితీ రేట్లకు సరఫరా చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ మందులలో 60 శాతానికి పైగా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ వారి ఆధీనంలో ఉండేవేనన్నారు. వీటి గరిష్ట రిటైల్ ధరలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయని వివరించారు. మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకునే చెల్లింపులు చేస్తామని తెలిపారు. టెండర్ ఎంపికలో ఎటువంటి మతలబు జరగలేదని, సరఫరాదారుడుకి స్థాయి ఉండాలనే ఉద్దేశంతోనే రూ.10 కోట్లుగా నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment