
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తారా?
బిల్డింగ్‌లపై కాదు... వికేంద్రీకరణ, అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది
సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది.
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు.