డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి | DME range in district hospital | Sakshi
Sakshi News home page

డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి

Published Fri, Feb 13 2015 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి

డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి

నిజామాబాద్‌అర్బన్ : ఎట్టకేలకు జిల్లా ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ నుంచి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లింది. గురువారం ప్రభుత్వం జీవో నం.14ను విడుదల చేసింది. దీని ప్రకారం మెడికల్ కళాశాలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారు, జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వారు మెడికల్ కళాశాల పరిధిలోనే ఉన్నట్లు పరిగణించాలని డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంత కాలంగా  ఆస్పత్రి అనుసంధానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూడు సంవత్సరాల తరువాత ఈ అనుసంధానం పూర్తయింది. జిల్లాలో 2008 సంవత్సరంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ షష్టిపుర్తి వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు వచ్చారు. నాడు ఖలీల్‌వాడి గ్రౌండ్‌లో జరిగిన సభలో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాదిలో నగరంలోని ఖిల్లా రామాయలం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం పరిస్థితులు మారడంతో కళాశాలను ఖలీల్‌వాడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు మళ్లీ శంకుస్థాపన చేశారు.

2010 నాటికి పనులు పూర్తి చేసి 2011 లో  తరగతి బోధన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం రూ. 100 కోట్లను విడుదల చేసింది. జాప్యం ఏర్పడి పనులు 2013 వరకు కొనసాగాయి. 2013  ఆగస్టులో తొలిసారిగా  100 మంది విద్యార్థులతో తరగతుల బోధన ప్రారంభమైంది. వాస్తవానికి ఎంసీఐ కళాశాల అనుమతి కోసం సంవత్సరానికి మూడు సార్లు చొప్పున తనిఖీలు చేసింది. ఈ క్రమంలోనే జిల్లా ఆస్పత్రిని డీఎంఈ ఆధీనంలోకి మార్చవల్సి ఉంది. అరుుతే కొన్ని కారణాల వల్ల ఆస్పత్రిని మార్చడంలో ఆలస్యం ఎదురైంది. అంతేకాకుండా మెడికల్ కళాశాలకు 882 పోస్టుల భర్తీకి సంబంధించి 150 జీవోను నాటి ప్రభుత్వం విడుదల చేసింది. మరో వైపు మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ లేక, డిప్యూటేషన్‌పై ఉద్యోగులు లేక సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా ఆస్పత్రి ఉండడంతో ఉద్యోగుల బదలాయింపు కుదరలేదు.
 
120 మంది ప్రొఫెసర్లు
ఆస్పత్రి మెడికల్ కాళాశాలకు అనుసంధానమైనందున మెరుగైన వైద్యసేవలు అందుతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉండడంతో మెడికల్ కళాశాలకు కేటాయించబడిన ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు ఇష్టపడలేదు. సుమారు 120 మంది ప్రొఫెసర్లను ప్రభుత్వ మెడికల్  కళాశాలకు నియమించింది. వీరు ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు వైద్యవిధాన పరిషత్‌కు చెందిన వారు ఉండడంతో వారి ఆధీనంలో తాము ఎందుకు పనిచేయాలంటూ మొండికేశారు. ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్ విధులకు రానివారికి గైర్హాజరేయడంతో ప్రొఫెసర్లు కోపోద్రిక్తులయ్యారు.  రాష్ట్ర వైద్యుల సంఘాన్ని పిలిపించి వైద్య విధాన పరిషత్ అధికారులపై మందలింపజేశారు.

ప్రస్తుతం కూడా ప్రొఫెసర్లు 60 నుండి 70 వరకు గైర్హాజరవుతున్నారు.  విధి నిర్వహణలో బాధ్యతలు తమవి కావన్నట్టు, జిల్లా ఆస్పత్రి, కళాశాల అధికారులు తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాలకు మూడవ సంవత్సరం అనుమతికి ఆటంకాలు లేకుండా పోయాయి. ఆస్పత్రి మెడికల్ కళాశాలకు అనుసంధానం కావడంతో ఎంసీఐ కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు. డీఎన్‌బీ కోర్సుల ఏర్పాటుకు కూడా అనుమతి సులవుగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆస్పత్రికి డీఎంఈ నుంచినిధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పోస్టుల భర్తీ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కిందట ప్రభుత్వం 882 పోస్టులకు సంబంధించి 150 జీవోను విడుదల చేసింది. ఆస్పత్రి అనుసంధానం లేకపోవడం, ఇతరాత్ర కారణాల వల్ల పోస్టుల భర్తీ జరుగలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement