క్రమశిక్షణతోనే రాణింపు
ఫ్రెషర్స్ డేలో డీఎంఈ
అనంతపురం మెడిక ల్ : క్రమశిక్షనతోనే ఉన్నత స్థాయిలో రాణించగలరని మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శాంతరావు విద్యార్థులకు సూచించారు. స్థానిక వైద్య కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నీరజ అధ్యక్షత వహించారు. డీఎంఈతో పాటు జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్ లాల్ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాంతరావు మాట్లాడుతూ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఈ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులు మహోన్నత ఆశయంతో లక్ష్యాలను సాధించాలని ఉద్బోధించారు. రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన జిల్లాగా అనంతపురం మారబోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బోధనాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ స్థాయికి చేరనుందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థుల సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం కానున్నాయన్నారు.
లాల్ కిషోర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైదన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
డాన్స్‌లతో హోరేత్తించిన విద్యార్థులు
ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. విద్యార్థిని ప్రణతి కూచిపూడి నృత్యం కృష్ణ తరంగంతో మొదలైన కార్యక్రమం.. దూమ్మాచ్చాలే అంటూ కూర్రాళ్ల స్టెప్పులతో జోరందుకుంది. మధ్య మధ్యలో ఆట విడుపులా విద్యార్థులు పేల్చిన కామెడీ స్ట్రోక్స్ ఆహూతులను కడుపుబ్బనవ్వించాయి.. వెంకీ, విక్రమార్కుడు, బొమ్మరిల్లు సినిమాల్లో... ప్రకాజ్‌రాజ్ పాత్రను ప్రొఫెసర్‌గా మార్చి... వెంకటేష్, రవితేజ, సిద్ధార్థ పాత్రలను విద్యార్థులుగా మార్చి పేరడీ డైలాగ్‌తో హాస్యాన్ని పండించారు. ఆ వెంటనే ‘‘ముక్కాలా ముక్కాబులా’’ స్టెప్పులతో మరో బ్యాచ్ ఊర్రూతలూగించింది. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల కేరింతలతో హుషారుగా సాగింది.