Director of medical education
-
దిగొచ్చిన దీదీ
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు. వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు. అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.నేడు సుప్రీం విచారణ న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. 2024-2025 ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీంతో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాప్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక.. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా ఎన్.వాణి నియామకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాణిని డీఎంఈగా నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. సర్వీసులో తనకంటే జూనియర్‌ను ఇన్ఛార్జిగా నియమించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇన్‌ఛార్జి ప్రాతిపదికన కాకుండా అదనపు బాధ్యతలు లేదా శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు కొత్త డీఎంఈను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చదవండి: విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా -
ర్యాగింగ్ కలకలం
► మెడికల్ కళాశాలలో ప్రత్యేక బృందం విచారణ ► డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు నివేదిక ► ఆలస్యంగా వెలుగులోకి.. అనంతపురం: అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న రాత్రి మహిళల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు హాస్టల్ పక్కన ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థినిని సీనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసింది. మనస్థాపానికి గురైన సదరు విద్యార్థిని కర్నూలులో ఉన్న తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆయన ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఘటనపై విచారణ చేయాలని మెడికల్ కళాశాలకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో ఈనెల 28న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. డాక్టర్లు మల్లీశ్వరి, ప్రభాకర్, శ్యాంప్రసాద్, శారద, సాయి సుధీర్లతో కూడిన బృందం విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించగా, ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. బాధిత విద్యార్థిని తండ్రిని కూడా విచారణకు రప్పించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన మరుసటి రోజే వారు ‘సారీ’ చెప్పుకున్నారని, విషయం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని, కొందరు విద్యార్థినులు చెప్పినట్లు సమాచారం. కాగా ర్యాగింగ్‌కు సంబంధించి విద్యార్థినులతో రాత పూర్వకంగా లేఖ తీసుకున్నట్లు తెలిసింది. ఆ లేఖతో పాటు విచారణ బృందం నివేదికను కూడా అదే రోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆ తర్వాత రిపోర్ట్‌ను కలెక్టర్‌తో పాటు డీఎంఈకి పంపినట్లు సమాచారం. కాగా కళాశాల హాస్టళ్లలో కొందరు సీనియర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లు తమను ‘మేడం’ అని సంభోదించాలని, లేకుంటే ‘మాటల’తో మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. పైగా భోజనం తినే సమయంలో కూడా జూనియర్లు ముందు వెళ్తే కొందరు సీనియర్లు మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో కళాశాల విద్యార్థులందరితో కళాశాల యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
రోగులకు శాపంలా ఆస్పత్రుల విలీనం
► వైద్యం అందక చిన్నారుల అవస్థలు ► నర్సులే వైద్యం చేస్తున్న వైనం ► ఆందోళనలో తల్లిదండ్రులు నెల్లూరు (అర్బన్) : డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడకల్ ఎడ్యుకేషన్)లోకి ఆసుపత్రుల విలీనం రోగుల పాలిట శాపంలా మారింది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఒకే చోట మెటర్నటీ, చిన్న పిల్లల ఆసుపత్రుల ఉండాలని జీజీహెచ్ ఆవరణలోని ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రికి జూబ్లీను మారుస్తున్నారు. తాజాగా నగరంలోని స్టోన్‌హోస్‌పేట వద్ద ఉన్న రేబాల చిన్న పిల్లల ఆసుపత్రిని కొత్త ఆసుపత్రికి మారుస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వస్తున్న చిన్నారులు అల్లాడిపోతున్నారు. నిరీక్షించాల్సిందే... రేబాల ఆసుపత్రిని ప్రభుత్వాస్పత్రికి మార్చామని, ఓపీ, అడ్మిషన్ల అక్కడే చూస్తారని చాలా రోజుల కిందటే బ్యానర్‌ను అంటించారు. సిబ్బంది కొంత మందిని తరలించారు. కొత్త ఆసుపత్రిలో రోగులను చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చే వరకు రేబాలలో ఓపీల వరకు చూడాలని భావించారు. కేవలం ఒకరిద్దరు డాక్టర్లను, మరికొంత సిబ్బందిని మాత్రమే అందుబాటులో ఉంచారు. ఒకరిద్దరు నర్సులే పిల్లలను పరీక్షిస్తున్నట్లు సమాచారం. తమ వల్ల కాకపోతే కొత్త ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. మందులు సైతం లేవని చెబుతున్నారు. అంతా గందరగోళం.... ఆసుపత్రుల తరలింపు మొత్తం పూర్తిగా గందరగోళంగా సాగుతోంది. జూబ్లీకి, రేబాలకు రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అధికారులు వాళ్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మొక్కుబడిగా ఆసుపత్రులను తరలిస్తున్నారు. పలువురు డాక్టర్లు సంతకాలు పెట్టి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడంలేదు. రెండు ఆసుపత్రుల్లో వైద్య సేవలను అనధికారికంగా బంద్ చేయించిన అధికారులు కొత్త ఆసుపత్రిలో సౌకర్యాలను త్వరగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. -
డీఎంఈ పరిధిలోకి జిల్లా ఆస్పత్రి
నిజామాబాద్‌అర్బన్ : ఎట్టకేలకు జిల్లా ఆస్పత్రి వైద్యవిధాన పరిషత్ నుంచి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లింది. గురువారం ప్రభుత్వం జీవో నం.14ను విడుదల చేసింది. దీని ప్రకారం మెడికల్ కళాశాలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారు, జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వారు మెడికల్ కళాశాల పరిధిలోనే ఉన్నట్లు పరిగణించాలని డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంత కాలంగా ఆస్పత్రి అనుసంధానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల తరువాత ఈ అనుసంధానం పూర్తయింది. జిల్లాలో 2008 సంవత్సరంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ షష్టిపుర్తి వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు వచ్చారు. నాడు ఖలీల్‌వాడి గ్రౌండ్లో జరిగిన సభలో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాదిలో నగరంలోని ఖిల్లా రామాయలం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం పరిస్థితులు మారడంతో కళాశాలను ఖలీల్‌వాడీ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు మళ్లీ శంకుస్థాపన చేశారు. 2010 నాటికి పనులు పూర్తి చేసి 2011 లో తరగతి బోధన చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం రూ. 100 కోట్లను విడుదల చేసింది. జాప్యం ఏర్పడి పనులు 2013 వరకు కొనసాగాయి. 2013 ఆగస్టులో తొలిసారిగా 100 మంది విద్యార్థులతో తరగతుల బోధన ప్రారంభమైంది. వాస్తవానికి ఎంసీఐ కళాశాల అనుమతి కోసం సంవత్సరానికి మూడు సార్లు చొప్పున తనిఖీలు చేసింది. ఈ క్రమంలోనే జిల్లా ఆస్పత్రిని డీఎంఈ ఆధీనంలోకి మార్చవల్సి ఉంది. అరుుతే కొన్ని కారణాల వల్ల ఆస్పత్రిని మార్చడంలో ఆలస్యం ఎదురైంది. అంతేకాకుండా మెడికల్ కళాశాలకు 882 పోస్టుల భర్తీకి సంబంధించి 150 జీవోను నాటి ప్రభుత్వం విడుదల చేసింది. మరో వైపు మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ లేక, డిప్యూటేషన్‌పై ఉద్యోగులు లేక సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా ఆస్పత్రి ఉండడంతో ఉద్యోగుల బదలాయింపు కుదరలేదు. 120 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రి మెడికల్ కాళాశాలకు అనుసంధానమైనందున మెరుగైన వైద్యసేవలు అందుతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉండడంతో మెడికల్ కళాశాలకు కేటాయించబడిన ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు ఇష్టపడలేదు. సుమారు 120 మంది ప్రొఫెసర్లను ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నియమించింది. వీరు ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు వైద్యవిధాన పరిషత్‌కు చెందిన వారు ఉండడంతో వారి ఆధీనంలో తాము ఎందుకు పనిచేయాలంటూ మొండికేశారు. ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్ విధులకు రానివారికి గైర్హాజరేయడంతో ప్రొఫెసర్లు కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్ర వైద్యుల సంఘాన్ని పిలిపించి వైద్య విధాన పరిషత్ అధికారులపై మందలింపజేశారు. ప్రస్తుతం కూడా ప్రొఫెసర్లు 60 నుండి 70 వరకు గైర్హాజరవుతున్నారు. విధి నిర్వహణలో బాధ్యతలు తమవి కావన్నట్టు, జిల్లా ఆస్పత్రి, కళాశాల అధికారులు తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాలకు మూడవ సంవత్సరం అనుమతికి ఆటంకాలు లేకుండా పోయాయి. ఆస్పత్రి మెడికల్ కళాశాలకు అనుసంధానం కావడంతో ఎంసీఐ కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు. డీఎన్బీ కోర్సుల ఏర్పాటుకు కూడా అనుమతి సులవుగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆస్పత్రికి డీఎంఈ నుంచినిధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పోస్టుల భర్తీ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కిందట ప్రభుత్వం 882 పోస్టులకు సంబంధించి 150 జీవోను విడుదల చేసింది. ఆస్పత్రి అనుసంధానం లేకపోవడం, ఇతరాత్ర కారణాల వల్ల పోస్టుల భర్తీ జరుగలేదు. -
క్రమశిక్షణతోనే రాణింపు
ఫ్రెషర్స్ డేలో డీఎంఈ అనంతపురం మెడిక ల్ : క్రమశిక్షనతోనే ఉన్నత స్థాయిలో రాణించగలరని మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శాంతరావు విద్యార్థులకు సూచించారు. స్థానిక వైద్య కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నీరజ అధ్యక్షత వహించారు. డీఎంఈతో పాటు జేఎన్టీయూ వైస్ చాన్సలర్ లాల్ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాంతరావు మాట్లాడుతూ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులు మహోన్నత ఆశయంతో లక్ష్యాలను సాధించాలని ఉద్బోధించారు. రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన జిల్లాగా అనంతపురం మారబోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బోధనాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ స్థాయికి చేరనుందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థుల సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం కానున్నాయన్నారు. లాల్ కిషోర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైదన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. డాన్స్‌లతో హోరేత్తించిన విద్యార్థులు ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. విద్యార్థిని ప్రణతి కూచిపూడి నృత్యం కృష్ణ తరంగంతో మొదలైన కార్యక్రమం.. దూమ్మాచ్చాలే అంటూ కూర్రాళ్ల స్టెప్పులతో జోరందుకుంది. మధ్య మధ్యలో ఆట విడుపులా విద్యార్థులు పేల్చిన కామెడీ స్ట్రోక్స్ ఆహూతులను కడుపుబ్బనవ్వించాయి.. వెంకీ, విక్రమార్కుడు, బొమ్మరిల్లు సినిమాల్లో... ప్రకాజ్‌రాజ్ పాత్రను ప్రొఫెసర్‌గా మార్చి... వెంకటేష్, రవితేజ, సిద్ధార్థ పాత్రలను విద్యార్థులుగా మార్చి పేరడీ డైలాగ్‌తో హాస్యాన్ని పండించారు. ఆ వెంటనే ‘‘ముక్కాలా ముక్కాబులా’’ స్టెప్పులతో మరో బ్యాచ్ ఊర్రూతలూగించింది. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల కేరింతలతో హుషారుగా సాగింది. -
నర్సింగ్ కళాశాలకు బ్రేక్!
జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల నర్సింగ్ కళాశాలకు ఆర్థికశాఖ మోకాలడ్డుతోంది. కళాశాలకు అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేయాలని ఆర్థికశాఖకు పంపించిన ఫైల్‌ను డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ పెండింగ్‌లో పెట్టింది. మెడికల్ కళాశాల లేని ప్రాంతాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు మంజూరు ఇస్తే ఇబ్బందులొస్తాయని భావించి ఈ నిర్ణయం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆగస్టులో ఏర్పాట్లను పరిశీలించి నర్సింగ్ కశాశాలకు పచ్చజెండా ఊపింది. ఏపీ నర్సింగ్ డిపార్ట్మెంట్ ఆగస్టు చివరివారంలో ఇక్కడకొచ్చి అనుమతి ఇచ్చింది. విద్యావతిగౌడ్ను ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించింది. మరికొంత మంది బోధన సిబ్బందిని కూడా నియమించింది. కళాశాలకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధరూర్ క్యాంపులో కేటాయించారు. ఈ విద్యాసంవత్సరం తాత్కాలికంగా జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ యూనివర్సిటీ గతనెల 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల ఐదో తేదీ నాటికి దరఖాస్తుల గడువు ముగియనుంది. అనంతరం జరిగే కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేస్తారు. జగిత్యాల బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో నలభై సీట్లున్నాయి. నిధుల అనుమతికి నిరాకరణ? కళాశాల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని ఏరియా ఆస్పత్రి సమకూర్చింది. భవన నిర్మాణం, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు, కళాశాల నిర్వహణకు రూ.50 లక్షలు కేటాయించాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ మూడు నెలల క్రితం డీఎంఈకి నివేదించారు. వీటిని పరిశీలించి నిధులు విడుదల చేయాల్సిన ఫైనాన్స్ సెకట్రరీలు పీవీ.రమేష్, ఎల్.సుబ్రహ్మణ్యం ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారు. మెడికల్ కళాశాలగానీ.. డెంటల్ కళాశాల గానీ లేని జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతటా ఇదే పరిస్థితి: విద్యావతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్థానిక నర్సింగ్ కళాశాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుందనుకుంటున్నాం. ఆదిలాబాద్, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రాంతాల్లోని కళాశాలకు కూడా ఫైనాన్స్ అనుమతులు లభించాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఐఏఎస్‌లను కలిసి ఇక్కడ పరిస్థితిని వివరిస్తే అనుమతి తొందరగా వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యేకు విన్నవించాం.