జూడాల కీలక డిమాండ్లకు అంగీకారం
కోల్‌కతా పోలీసు కమిషనర్ గోయల్‌పై వేటు
వైద్యవిద్య డైరెక్టర్ తొలగింపు
ఆరోగ్య సేవల డైరెక్టర్ కూడా
ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవు
విధుల్లో చేరాలని వినతి
చర్చించి చెబుతామన్న జూడాలు
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్‌లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు.
వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు.
సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు.
రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు.
అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.
నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment