Kolkata Police Commissioner
-
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
దిగొచ్చిన దీదీ
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు. వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు. అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.నేడు సుప్రీం విచారణ న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
కోల్‌కతా పోలీస్ చీఫ్ బదిలీ
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో సీబీఐ విచారణను ఎదుర్కొన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీ, నేర పరిశోధన విభాగంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోల్‌కతా పోలీస్ చీఫ్‌గా రాజీవ్ కుమార్ స్దానంలో అనుజ్ శర్మ నియమితులయ్యారు. శారదా చిట్‌ఫండ్, రోజ్ వ్యాలీ స్కామ్‌ల్లో ఆధారాలను రాజీవ్ కుమార్ తారుమారు చేశారని సీబీఐ ఆరోపిస్తున్న క్రమంలో ఆయనను కోల్‌కతా పోలీస్ చీఫ్‌గా తప్పించడం గమనార్హం. కాగా, కాల్ రికార్డుఆధారాలను రాజీవ్ కుమార్ తారుమారు చేశారని సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు కోల్‌కతాలోని ఆయన నివాసానికి సీబీఐ బృందాలు చేరుకోగా సీఎం మమతా బెనర్జీ ఆయనకు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ ఆమె ధర్నా చేపట్టగా కొన్ని విపక్ష పార్టీలు దీదీకి మద్దతు ప్రకటించాయి. -
‘ప్రాణాలైనా అర్పిస్తా..రాజీ పడను’
సాక్షి, కోల్‌కతా : సీబీఐ వివాదంతో పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న కోల్డ్ వార్ తీవ్రస్ధాయికి చేరింది. తాను ప్రాణాలైనా అర్పిస్తాను కానీ పరిస్థితులతో రాజీపడబోనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ పరాఈ్ట నేతలను కేంద్రం ఇబ్బందిపెట్టినా తాను వీధుల్లోకి రాలేదని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ పదవినీ అగౌరవపరిచేందుకు కేంద్రం ప్రయత్నించడంతో తాను ఆగ్రహానికి లోనయ్యానన్నారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ కేసుల్లో కోల్‌కతా పోలీస్ చీఫ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రయత్నించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాను ఆందోళనబాట పట్టానన్నారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్, రోజ్‌వ్యాలీ స్కామ్ కేసులకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించేందుకు ఆయన నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారుల బృందాన్ని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. -
కోల్‌కతా బీజేపీ కార్యాలయంపై దాడి
కోల్‌కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమైంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలతో తలపడుతుంటే సోమవారం కోల్‌కతాలో బీజేపీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. పాలక తృణమూల్ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం తమపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడులను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్షకు దిగడంతో పరిస్ధితి వేడెక్కింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో విపక్షాలు మమతా బెనర్జీకి బాసటగా నిలవగా అవినీతిని ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని విచారించడం నేరమా అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
కోల్‌కతాలో ‘దీదీ’గిరి!
కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆదివారం కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న రెండు పోలీసు విభాగాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. అయితే సీబీఐ అధికారుల అరెస్ట్‌పై భిన్న కథనాలు వినిపించాయి. తమ అధికారుల్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని సీబీఐ ఆరోపిం చగా, సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఖండిం చారు. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు తగిన పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించేందుకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆ తరువాత బెంగాల్ పోలీసుల బృందం ఒకటి కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమ అదుపులోకి తీసుకుంది. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు బెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించా లని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ తెలిపింది. శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి పథకాలకు సంబంధించి రాజీవ్‌కుమార్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే అదనుగా బీజే పీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బెంగాల్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని తృణమూల్ ఆరోపించగా, రాజ్యాంగ సమగ్రత, విలువల్ని మమత ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. డ్రామా కొనసాగిందిలా.. కోల్‌కతాలో లౌడాన్ వీధిలోని రాజీవ్‌కుమార్ నివాసానికి సుమారు 40 మంది సీబీఐ అధికారులు చేరుకున్నాక కనీవినీ ఎరుగని హైడ్రామా మొదలైంది. వారు లోనికి వెళ్లకుండా అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని వాకబు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొందరు అధికారుల్ని షేక్స్పియర్ సరాని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే రాజీవ్‌కుమార్ నివాసానికి మరికొందరు సీబీఐ అధికారులు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. వారిలో కొందరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ ముగిశాక సీబీఐ అధికారుల్ని వదిలిపెట్టినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. రహస్య ఆపరేషన్ నిమిత్తం కోల్‌కతాకు వచ్చామని వారు చెప్పారని, అది ఏ రకమైన ఆపరేషనో తమకు తెలియదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతను నివారించడానికి కోల్‌కతా సీబీఐ కార్యాలయం వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. సీబీఐ దాడులు ఊహించాం: మమతా బెనర్జీ రాజీవ్‌కుమార్ నివాసం బయట హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. ‘చేతులకు రక్తపు మరకలు అంటుకున్న అలాంటి ప్రధానితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది. జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీ తరువాత సీబీఐతో దాడులు చేయిస్తారని మాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిట్‌ఫండ్ కంపెనీల యజమానుల్ని అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసింది మేమే’ అని మమతా బెనర్జీ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిహసించారు: బీజేపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్‌ఫండ్ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్‌కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. బెంగాల్లో శాంతి, భద్రతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించింది. మమతకు విపక్షాల బాసట.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆమెకు ఫోన్‌చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ శక్తుల్ని ఓడిస్తామని రాహుల్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లుపొడిచారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోదీ–షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్లో సీబీఐ చర్యను ఖండించాలని అన్నారు. సీబీఐ నోటీసులకు స్పందించని కమిషనర్ శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ కేసులకు సంబంధించి గల్లంతయిన కొన్ని పత్రాల విషయమై ఆయనని విచారించాల్సి ఉందని సీబీఐ ప్రకటించింది. తమ ముందు హాజరుకావాలని సీబీఐ పలు నోటీసులు పంపినా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు ఇటీవల ఎన్నికల సంఘం కోల్‌కతాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి రాజీవ్‌కుమార్ హాజరుకాలేదు. అయితే రాజీవ్‌కుమార్ విధులకు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్తల్ని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన కోల్‌కతాలోనే ఉన్నారని, రోజూవారీ విధులకు హాజరువుతున్నారని ప్రకటన విడుదల చేశారు. సీబీఐ అధికారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
కోల్‌కతా పోలీస్ బాస్ అదృశ్యం
న్యూఢిల్లీ: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కనిపించకుండా పోయారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రోజ్ వ్యాలీ, శ్రద్ధా పోంజి భారీ కుంభకోణాలపై దర్యాప్తునకు గతంలో రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆ కుంభకోణాలకు సంబంధించిన పలు కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. వాటి కోసం పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదు. రాజీవ్ సెల్ఫోన్సహా ఏ ఇతర నంబర్ పనిచేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్టు చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. -
కోల్ కతా పోలీసు కమిషనర్ పై వేటు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం(ఈసీ) కొరడా ఝుళిపించింది. కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ పై వేటు వేసింది. ఆయనను కమిషనర్ పదవి నుంచి తొలగించింది. రాజీవ్ కుమార్ స్థానంలో అడిషనల్ డీజీ(సీఐడీ) సౌమెన్ మిత్రాను నియమించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ కుమార్ అనుకూలంగా వ్యహరిస్తున్నారని విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించడంతో ఆయనపై ఈసీ చర్య తీసుకుంది. కోట్లాది రూపాయల శారద చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తు సమయంలో ఆయన పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.