కోల్‌కతాలో ‘దీదీ’గిరి! | Mamata Banerjee On Dharna In Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో ‘దీదీ’గిరి!

Published Mon, Feb 4 2019 3:49 AM | Last Updated on Mon, Feb 4 2019 1:03 PM

Mamata Banerjee On Dharna In Kolkata - Sakshi

సీబీఐ దాడుల తరువాత ధర్నాకు దిగిన మమతా బెనర్జీ. చిత్రంలో పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ (ఎడమ)

కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో ఆదివారం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్ని బెంగాల్‌ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న రెండు పోలీసు విభాగాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే పోలీస్‌ కమిషనర్‌ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. అయితే సీబీఐ అధికారుల అరెస్ట్‌పై భిన్న కథనాలు వినిపించాయి. తమ అధికారుల్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారని సీబీఐ ఆరోపిం చగా, సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ఖండిం చారు.

పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించేందుకు తగిన పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించేందుకే వారిని పోలీస్‌  స్టేషన్‌కు తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆ తరువాత బెంగాల్‌ పోలీసుల బృందం ఒకటి కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమ అదుపులోకి తీసుకుంది. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్‌ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించా లని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ తెలిపింది.

శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి పథకాలకు సంబంధించి రాజీవ్‌కుమార్‌ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే అదనుగా బీజే పీ, తృణమూల్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బెంగాల్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని తృణమూల్‌ ఆరోపించగా, రాజ్యాంగ సమగ్రత, విలువల్ని మమత ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది.

డ్రామా కొనసాగిందిలా..
కోల్‌కతాలో లౌడాన్‌ వీధిలోని రాజీవ్‌కుమార్‌ నివాసానికి సుమారు 40 మంది సీబీఐ అధికారులు చేరుకున్నాక కనీవినీ ఎరుగని హైడ్రామా మొదలైంది. వారు లోనికి వెళ్లకుండా అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని వాకబు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొందరు అధికారుల్ని షేక్‌స్పియర్‌ సరాని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఆ వెంటనే రాజీవ్‌కుమార్‌ నివాసానికి మరికొందరు సీబీఐ అధికారులు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. వారిలో కొందరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ ముగిశాక సీబీఐ అధికారుల్ని వదిలిపెట్టినట్లు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (క్రైం) ప్రవీణ్‌ త్రిపాఠి చెప్పారు. రహస్య ఆపరేషన్‌ నిమిత్తం కోల్‌కతాకు వచ్చామని వారు చెప్పారని, అది ఏ రకమైన ఆపరేషనో తమకు తెలియదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతను నివారించడానికి కోల్‌కతా సీబీఐ కార్యాలయం వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి.

సీబీఐ దాడులు ఊహించాం: మమతా బెనర్జీ
రాజీవ్‌కుమార్‌ నివాసం బయట హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. ‘చేతులకు రక్తపు మరకలు అంటుకున్న అలాంటి ప్రధానితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది.

జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీ తరువాత సీబీఐతో దాడులు చేయిస్తారని మాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిట్‌ఫండ్‌ కంపెనీల యజమానుల్ని అరెస్ట్‌ చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసింది మేమే’ అని మమతా బెనర్జీ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు.   

రాజ్యాంగాన్ని పరిహసించారు: బీజేపీ
కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్‌ఫండ్‌ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్‌కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. బెంగాల్‌లో శాంతి, భద్రతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించింది.

మమతకు విపక్షాల బాసట..
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, సీబీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా ఆమెకు ఫోన్‌చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్‌ శక్తుల్ని ఓడిస్తామని రాహుల్‌ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లుపొడిచారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోదీ–షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్‌లో సీబీఐ చర్యను ఖండించాలని అన్నారు.  

సీబీఐ నోటీసులకు స్పందించని కమిషనర్‌
శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ కేసులకు సంబంధించి గల్లంతయిన కొన్ని పత్రాల విషయమై ఆయనని విచారించాల్సి ఉందని సీబీఐ ప్రకటించింది. తమ ముందు హాజరుకావాలని సీబీఐ పలు నోటీసులు పంపినా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు ఇటీవల ఎన్నికల సంఘం కోల్‌కతాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి  రాజీవ్‌కుమార్‌ హాజరుకాలేదు. అయితే రాజీవ్‌కుమార్‌ విధులకు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్తల్ని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన కోల్‌కతాలోనే ఉన్నారని, రోజూవారీ విధులకు హాజరువుతున్నారని ప్రకటన విడుదల చేశారు.


సీబీఐ అధికారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement