కోల్‌కతా : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 30న ఆర్‌జీకార్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఆ లేఖతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్ ఘోష్ సైతం ఉన్నారని సమాచారం. ఇక ఆ లేఖపై దీదీని బీజేపీ టార్గెట్ చేసింది. సందీప్ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్‌జీకార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని, బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. ‘ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో అవకతవకలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలగించలేదు. ప్రిన్సిపల్‌గా కొనసాగారు’ అని తిబ్రేవాల్ చెప్పారు.
రాజీనామా అంతలోనే పోస్టింగ్
వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండురోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.
సందీప్ ఘోష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
అదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సందీష్ ఘోష్ చుట్టు ఉచ్చు మరింత బిగిసేలా.. ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్‌జీ కార్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం
ఈ వారం ప్రారంభంలో అక్తర్ అలీ డాక్టర్ సందీష్ ఘోష్ మార్చురీలోని అనాధ శవాలతో వ్యాపారం చేశారని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సందీష్ ఘోష్‌ను విచారణకు ఆదేశించింది.
ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ఎవరు టచ్‌లో ఉన్నారు? ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు ఆలస్యం అయ్యింది?అని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment