కోల్‌కతా : ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాల్ని వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ పరీక్షల్లో సైతం అన్నీ అబద్ధాలు చెప్పినట్లు తేలిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి వచ్చిన రిపోర్ట్ సైతం సందీప్ ఘోష్ చెప్పిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నట్లు పీటీఐ సైతం నివేదించింది.
అభయ కేసు విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాల్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ఆగస్టు 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగినట్లు సందీప్ ఘోష్‌కు ఉదయం 9.58 గంటలకు సమాచారం అందింది. కానీ సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలి స్నేహితులు, తోటి జూనియర్ డాక్టర్లు విమర్శలు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఘటనకు.. ఏ మాత్రం సంబంధం లేకుండా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
హత్య జరిగితే.. ఆత్మహత్య అని ఎలా అంటారు?
అదే సమయంలో ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని సీబీఐ అధికారులు ప్రస్తావించారు. బాధితురాలి దుస్తులు, ఆమె శరీరంపై గాయాలు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కేసు నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైంది?
అభయ ఘటనపై సందీప్ ఘోష్ ఆగస్టు 9 ఉదయం 10.03 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి (ఓసీ) అభిజిత్ మోండల్‌తో సంప్రదించగా.. ఉదయం 11.30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే అంశంపై సీబీఐ అధికారులు మోండల్‌ను అరెస్ట్ చేశారు.
జనరల్ డైరీ ఎంట్రీలో ఇలా
జనరల్ డైరీ ఎంట్రీ 542 ప్రకారం.. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో వైద్యురాలు అచేతనంగా పడి ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అప్పటికే బాధితురాలిని పరిశీలించిన ఆమె సహచర జూనియర్ డాక్టర్ మరణించినట్లు నిర్ధారించారు.
సాక్ష్యాలన్నీ నాశనం
ఆసుపత్రి అధికారులు, నిందితులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో మోండల్ జాప్యం చేయడం, నేరం జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై కీలకమైన సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.
బాధితురాలి ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెల్లవారు జామున 4.03 గంటలకు నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లో ఉన్న అభయ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంనతరం, అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment