కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన ఎంపీ అభిషేక్ బెనర్జీ 11ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తామని పలువురు బెదిరించిన వీడియోలు పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల సంఘం దృష్టికి వచ్చాయి.
ఆర్‌జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసనర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి అభిషేక్ బెనర్జీ కుమార్తెపై దారుణానికి ఒడిగడతామని బెదిరించగా.. మరో వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన వారికి రూ.10కోట్లు బహుమతి ఇస్తామని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై పిల్లల హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పిల్లల భద్రతకు హాని కలిగించేలా ఉంది’అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతేకాదు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.ఈ ఘటనపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల సంఘం పోలీసులను కోరింది.
జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీదీ రాజీనామా చేయాలని రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. ఇంతటి క్లిష్ట సమయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రం చురుగ్గా కనిపించడం లేదు. దాంతో పార్టీలో అంతర్గతంగా లుకలుకలున్నాయని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ ఎక్కడ..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment