కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి ఘటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. నవంబర్ 13న ఆరు అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆర్‌జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్‌జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి మద్దతుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ అంశం దీదీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్‌జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..‘ఆర్‌జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను తప్పుదారి పట్టించేలా గందరగోళానికి గురిచేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి’ అని అన్నారు.
‘సీపీఐఎం పాలన ఎలా ఉందో పశ్చిమ బెంగాల్ ప్రజలు చూశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పాలన ఎలా ఉందో గమనిస్తున్నారు. ఆర్‌జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్‌కతా పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం. మేం అన్నీ స్థానాల్లో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment