రెండో రోజుకు మమత ధర్నా | mamata banerjee continues on strike | Sakshi
Sakshi News home page

రెండో రోజుకు మమత ధర్నా

Published Tue, Feb 5 2019 4:06 AM | Last Updated on Tue, Feb 5 2019 10:53 AM

mamata banerjee continues on strike - Sakshi

వేదికపైనే అధికారిక పనులు నిర్వహిస్తున్న మమత

కోల్‌కతా/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ఆదివారం చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సోమవారం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లూ అటు ఎన్డీయే, ఇటు యూపీఏలకు సమ దూరంలో ఉన్న బీజేడీతోపాటు అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. అటు శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించాలన్న సీబీఐ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, కేసును అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, నియంతల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకే తాను ధర్నాకు దిగానని మమత పేర్కొన్నారు. బెంగాల్‌లో జరుగుతున్నవి కనీవినీ ఎరుగని దురదృష్టకర ఘటనలనీ, రాజ్యాంగం అక్కడ విఫలమైందనేలా ఇవి ఉన్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ భాగంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసే అధికారం కేంద్రానికే ఉందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠిని రాజ్‌నాథ్‌ నివేదిక కోరారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌ నివేదికను వెంటనే పంపించినప్పటికీ అందులో ఏం ఉందనే వివరాలు వెల్లడి కాలేదు. ఆదివారం నాటి ఘటనల్లో బెంగాల్‌లో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించారా అనే విషయంపై కేంద్ర హోం శాఖ విచారణ జరుపుతుందని హోం శాఖ అధికారులు చెప్పారు. రాజీవ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లగా బెంగాల్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, కేంద్రం తనపై కక్షగట్టి సీబీఐని పంపిందంటూ మమత ధర్నాకు దిగారు.

ధర్నా రాజకీయపరమైనది కాదు∙
సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను రాజకీయేతర ధర్నా చేస్తున్నాననీ, అయితే రాజకీయ పక్షాల మద్దతును తాను స్వాగతిస్తున్నానని మమత చెప్పారు. టీఎంసీ కార్యకర్తలు కొన్నిచోట్ల రైళ్లను అడ్డుకున్నారని తెలిసి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆమె కోరారు. ‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ నిరసనలో పాల్గొనచ్చు. ఆయా పార్టీల మద్దతును నేను స్వాగతిస్తున్నా’ అని చెప్పారు. బెంగాల్‌లో తిరుగుబాటును తెచ్చేందుకు మోదీ, అమిత్‌ కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ‘దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన దీక్ష ఇది. శుక్రవారం వరకు దీక్ష కొనసాగిస్తా’ అని అన్నారు.

టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు బెంగాల్‌లో పలుచోట్ల ప్రధాని మోదీ, అమిత్‌ షాల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. ధర్నాకు కూర్చున్న చోటు నుంచే మమత సోమవారం అధికారిక విధులు నిర్వర్తించారు. అక్కడే ఒక కార్యక్రమంలో ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాజీవ్‌ పాల్గొనడం గమనార్హం. సోమవారం బెంగాల్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గ సమావేశాన్ని మమత తాను ధర్నాకు దిగిన చోటే నిర్వహించారు. రాజ్యాంగానికి, దేశానికి రక్షణ లభించేవరకు ధర్నాను కొనసాగిస్తానని తొలుత చెప్పిన మమత.. అనంతరం విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8 వరకే ఈ ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు.  

మమతకు మద్దతుగా నేతలు
బీజేడీ సహా అనేక విపక్షాలు మమత ధర్నాకు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ప్రధాని దేవెగౌడ బెంగళూరులో మాట్లాడుతూ కేంద్రం వైఖరి చూస్తుంటే తనకు అత్యయిక స్థితి నాటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఆమెకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ప్రతిపక్షాలను నాశనం చేసి నిరంకుశ పాలన సాగించేందుకు కేంద్రం సీబీఐని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు మమతకు మద్దతు ప్రకటించారు.

సీబీఐ నుంచి తప్పించుకునేందుకే
సీబీఐ కేసుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే మమత ధర్నాకు దిగారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ అన్నారు. ‘ఇది మోదీ ఎమర్జెన్సీ కాదు, బెంగాల్‌లో మమత ఎమర్జెన్సీ. దీనిపై మేం పోరాడతామని టీఎంసీని హెచ్చరిస్తున్నాం. నాటి ప్రధాని ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు మేం ఆమెపై పోరాడి ఓడించాం. టీఎంసీనీ ఓడిస్తాం. సీబీఐ నుంచి తనను కాపాడుకునేందుకే ఆమె ధర్నా చేపడుతున్నారు’ అని జవడేకర్‌ అన్నారు.

అమిత్‌ షా, స్మృతీ ఇరానీ, యోగి ఆదిత్యనాథ్‌ల హెలికాప్టర్లు బెంగాల్‌లో దిగేందుకు మమత అనుమతి ఇవ్వలేదనీ, ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మమత వర్సెస్‌ కేంద్రం అంశంపై బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఏదైనా జరగొచ్చని అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల గతంలోలాగ ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం కుదరదనీ, మమత సర్కారును కూల్చే అవకాశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు.

నిజమైతే తీవ్ర చర్యలు: సుప్రీం
శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నాశనం చేశారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఇసుమంతైనా ఉందని తేలితే తీవ్ర చర్యలుంటాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కోల్‌కతాలో సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా ధర్నాలో పాల్గొంటున్న అసాధారణ పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. రాజీవ్‌ కుమార్‌పై సీబీఐ చేసిన ఆరోపణలతో కూడిన దరఖాస్తును సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ముందుంచారు. మధ్యాహ్నమే కేసును విచారించాలని మెహతా కోరినప్పటికీ కోర్టు తిరస్కరించింది.

‘ఆధారాలను నాశనం చేయడంలో పోలీస్‌ కమిషనర్‌ పాత్ర ఏ కొంచెం ఉందని తెలిసినా ఆయనపై తీవ్ర చర్యలుంటాయి’ అని జడ్జీలు అన్నారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలను కోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. రాజీవ్‌ను సీబీఐ ప్రశ్నించకుండా అడ్డుకునేందుకు బెంగాల్‌ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళవారమే ఈ కేసును విచారిస్తామంది. పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్‌ శివకాంత ప్రసాద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులపై నోటీసులకు సంబంధించిన చర్యలపై హైకోర్టు స్టే విధించినప్పటికీ రాజీవ్‌ ఇంట్లోకి ప్రవేశించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారని బెంగాల్‌ ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ కిశోర్‌ దత్తా కోర్టుకు తెలిపారు.

2017లోనే నోటీసులు పంపించాం: సీబీఐ
శారద స్కామ్‌ను విచారించిన బెంగాల్‌ పోలీసు విభాగనికి చెందిన సిట్‌ సభ్యులకు 2017 సెప్టెంబర్, 2018 డిసెంబర్‌ మధ్య దాదాపు 20 నోటీసులను జారీ చేశామని సీబీఐ వెల్లడించింది. వారిలో కోల్‌కతా ప్రస్తుత కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కూడా ఉన్నారని తెలిపింది. నోటీసులకు స్పందన లేనందువల్లనే విచారణ నిమిత్తం ఆయన నివాసానికి రావాల్సి వచ్చిందని పేర్కొంది. 2014లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని, అయితే, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ఇవ్వకుండా సిట్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఒక సీబీఐ అధికారి తెలిపారు.

అత్యుత్సాహం వెనుక..
మమత వ్యవహరిస్తున్న తీరు తమను దిగ్భ్రాంతికి గురి చేసిందిన శారద స్కామ్‌ బాధితులు వాపోతున్నారు. విచారణ జరపకుండా సీబీఐని అడ్డుకోవడం తమను మోసం చేయడమేనన్నారు. ఇది వాస్తవాలను దాచే ప్రయత్నమని చిట్‌ఫండ్‌ సఫరర్స్‌ ఫోరం కన్వీనర్‌ అసిమ్‌ చటర్జీ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంలో మమత వ్యవహరిస్తున్న తీరుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ధర్నా కేంద్రం తీరుకు నిరసనగానే అని మమత చెబుతున్నా.. శారద స్కామ్‌కు సంబంధించి విచారణ ఎప్పుడో ప్రారంభమైందని, గతంలోనూ అనేక అరెస్ట్‌లు జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పుడు స్పందించకుండా.. ఇప్పుడే ఈ స్థాయిలో ఘర్షణకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. మమత చేస్తున్న హంగామా వెనుక వేరే ఉద్దేశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్‌ను విచారించిన సిట్‌కు నేతృత్వం వహించిన, ప్రస్తుత కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నివాసంలోని లాకర్లో కీలకమైన ఆధారాలున్నాయని, అందువల్లనే స్పందన ఈ స్థాయిలో ఉందని వెల్లడించాయి.


ధర్నా వేదికపై సీఎం మమతా బెనర్జీ. పక్కన కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement