
సాక్షి, హైదరాబాద్ : శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం. అంతర్యుద్దానికి, రాజ్యాంగ సంక్షోభానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యత్నించారు. బెంగాల్ ఒక దేశమన్నట్లు వ్యవహరించరాదు’ అని హితవు పలికారు.
‘బెంగాల్ సీఎం, డీజీపీ, కోల్‌కత పోలీస్ కమీషనర్ కలిసి దీక్ష పేరుతో నాటకం ఆడారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో శిక్ష తప్పించుకోవడానికే సీబీఐ అధికారులపట్ల దారుణంగా వ్యవహరించారు. నేరస్తులవలె లాక్కెళ్లారు. కానీ, అసలు నేరస్తులకు మాత్రం రక్షణ కల్పించారు. చివరకు సత్యమే జయించింది. మమతా బెనర్జీకి ఇక ముఖం చెల్లదు. వినశకాలే విపరీత బుద్ధి’ అని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు ప్రకారం రాజీవ్ కుమార్ విచారిస్తే నిజం నిరూపణ అవుతుందన్నారు.
‘ఏపీ సీఎం చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, కుమార స్వామి, దేవేగౌడకు ఇదొక గుణ పాఠం. ఈ తీర్పు వారికి చెంపపెట్టు. ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వైఫల్యాలనుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు కేంద్రం ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. మమతకు మద్దతు తెలుపుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు’ అని ఒక ప్రకటలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment