సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం, బెంగాల్ గవర్నమెంట్ల మధ్య మొదలైన పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్న సీబీఐని బెంగాల్ పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తూ ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరుతో సీఎం మమతా బెనర్జీ నిరసన దీక్ష కూడా చేస్తున్నారు. రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టును మంగళవారం విచారించింది. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. (బెంగాల్ ‘యుద్ధం’)
ఈ తీర్పుతో ‘దీదీకి గట్టి షాక్ తగిలింది. విజయం మాదే’ అని ఎన్డీయే పక్షాలు వ్యాఖ్యానిస్తుండగా.. దీదీ మాత్రం నైతిక విజయం మాదేనంటూ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సీబీఐ విచారణను తామెప్పుడూ అడ్డుకోలేదని.. అది వ్యవహరించిన తీరును మాత్రమే వ్యతిరేకించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపైనే తమ యుద్ధమని ఉద్ఘాటించారు. విపక్ష నేతలతో చర్చించాకే దీక్ష విరమణపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. (రెండో రోజుకు మమత ధర్నా)
Comments
Please login to add a commentAdd a comment