chitfund scam
-
ప్రతీ నిబంధననూ మార్గదర్శి ఉల్లంఘించింది
సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ పేర్కొన్నారు. మార్గదర్శి పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ తెలిపారు. కోటికి పైగా చిట్స్ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. ‘అన్ని రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఆక్షన్ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారు. 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరు. కంపెనీనే సొంతంగా చిట్స్‌ను తీసుకుంటుంది. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు ‘చెక్ ప్రిపేర్ అయినా లెడ్జర్లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్ అమౌంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు బయటపడ్డాయి. గోస్ట్ సబ్ స్క్రైబర్స్ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో మార్గదర్శిపైపోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కొందరు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్స్ నడుస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్రమాలను కవర్ చేసుకుంటూ వార్తలు మార్గదర్శిలో అక్రమాలపై కవర్ చేసుకుంటూ ఈనాడులో రాసుకుంటున్నారు. మార్గదర్శికి అనుకూలంగా.. చిట్ ఫండ్ నిర్వహణలో తప్పులు లేనట్లు సొంత పేపర్లో రాశారు. మేము రాసిందే కరెక్ట్ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్‌లు ఉన్నారు. ఈనాడు రాస్తోంది కరెక్ట్ కాదు. అందుకే ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నాం. విచారణకి సహకరించరు.. పైగా రామోజీరావు, శైలజ కిరణ్‌లను మేము ప్రశ్నించకూడదు అంట, మార్గదర్సి చిట్స్ కార్యాలయాలలో తనిఖీలు చేయకూడదట. సీఐడీ బ్రాంచ్‌లలో తనిఖీ చేసినప్పుడు మార్గదర్సి రోజువారీ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టిస్తున్నారని తప్పువు వార్తలు రాస్తున్నారు. 3 వేల మందికి ఆ విషయమే తెలీదు మార్గదర్శిలో జరిగిన బిజినెస్‌లోనే అక్రమాలు జరుగుతున్నాయి. కోటికి పైగా చిట్లో పాల్గొన్న వాళ్లు 800 మందికి పైగా ఉన్నారు. మార్గదర్సిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగింది. శైలజా పీఎం నుంచి బెదిరింపు ఫోన్లు జగజ్జనని కేసులో 9 కోట్ల ఆస్తులు అటాచ్ చేశాం. అనుమతులు లేకుండా చిట్ గ్రూప్‌ను ప్రారంభించారు. వేలం జరగకుండా నాలుగైదు చిట్లు ఎలా కట్టించుకుంటారు. అన్నపూర్ణ దేవిని శైలజ కిరణ్ పీఏ శశికళ నుంచి బెదిరింపు ఫోన్లు వెళ్తున్నాయి. ఇది సీఐడీ విచారణను అడ్డుకోవడం కాదా?. 3 వేల మందికి చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు.800 మంది అత్యధిక డబ్బులతో నడుస్తున్న చిట్ల వివరాలను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపాం. విజయవాడలో ఒక బిల్డర్ 50 కోట్ల చిట్లు వేస్తున్నారు. అవి నగదా, చెక్‌ల రూపంలో చెల్లిస్తున్నారా..? అని విచారిస్తున్నాం’ అని తెలిపారు. అన్నపూర్ణ దేవి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపాం. ఫిర్యాదుదారు కుమార్తె ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వాళ్ళు ఫోర్జరీ సంతకంతో నష్టానికి వేలం పాట పాడించారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు ఏజెంట్లను మోసం చేస్తున్నారు. నరసరావుపేట బ్రాంచ్‌లో ఏజెంట్ సంతకాన్ని బ్రాంచ్ మేనేజర్ ఫోర్జరీ చేశారు. -ఫకీరప్ప, ఎస్పీ, సీఐడీ -
మేమూ ‘మార్గదర్శి’లో చేరాం.. మోసపోయాం.. సీఐడీ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, అమరావతి: ‘‘నేనూ మార్గదర్శిలో చేరా... ఓ మోపెడ్ కొనుక్కున్నా!.. ఓ ఇంటి వాడినయ్యా..!!’’ ఇలాంటి ప్రకటనలను నమ్మిన వేలాది మంది మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ చందాదారులు నిండా మునిగిపోయారు! ప్రతి నెలా కష్టార్జితం నుంచి పొదుపు చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు కడితే దారుణంగా మోసపోయామని ఆక్రోశిస్తున్నారు. చందాదారుల సొమ్మును తన కుటుంబ సభ్యుల సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేసిన రామోజీరావు తాపీగా కూర్చోగా చందాదారులు మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని కూడా డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు... మరికొందరు చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్ మనీ) ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుతున్నారు.. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీగా చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని నెలల తరబడి జాప్యం చేస్తున్నా ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించడం లేదు.. ఇలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసులను నమోదు చేసి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. మరోవైపు రాష్ట్రంలో నలుమూలల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద ఎత్తున సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కో చందాదారుడిది ఒక్కో వ్యధ! మూడు రోజుల్లో 300కిపైగా ఫిర్యాదులు మోసపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు ఫిర్యాదు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. చందాదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు ( 9493174065 ) అందుబాటులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద సంఖ్యలో సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్ నంబర్ అందుబాటులోకి రాకముందు సీఐడీకి దాదాపు వందకుపైగా ఫిర్యాదులు రాగా ఇప్పుడు మూడు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా చందాదారులు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చందాదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. చందాదారుల సొమ్ము సొంతానికి... మార్గదర్శి దివాళా అంచుకు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రామోజీరావు పాల్పడిన ఆర్థిక అక్రమాలతో చందాదారులు నిండా మోసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును రామోజీరావు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజస్లలో పెట్టుబడిగా పెట్టారు. మరికొన్ని నిధులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా తరలించేశారు. దాదాపు 2 వేలకుపైగా ఉన్న చిట్టీ గ్రూపుల చందాదారులు చెల్లించే చందా మొత్తంలో కొంత మొత్తాన్ని అటూఇటూ రొటేషన్ చేస్తూ దశాబ్దాలుగా మోసం చేస్తూ వచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు బయటపడటంతో 2022 నవంబరు నుంచి కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. మరోవైపు భారీగా చందాదారుల సొమ్మును రామోజీ తమ పేరిట స్థిర, చరాస్తులుగా మార్చేశారు. దీంతో ప్రసుత్తం చిట్టీ గ్రూపుల్లో ఉన్న దాదాపు 50 వేల మంది చందాదారులకు ప్రైజ్‌మనీని చెల్లించలేక మార్గదర్శి చిట్‌ఫండ్స్ చేతులెత్తేసింది. గత్యంతరం లేక దిక్కులు చూస్తోంది. రాష్ట్రంలోని 37 బ్రాంచీల పరిధిలో దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్ మనీ చెల్లించడం లేదని సమాచారం. గత 9 నెలల్లో రూ.1,620 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మరోవైపు రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని కూడా కాలపరిమితి ముగిసినా చెల్లించడం లేదు. వెరసి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ బకాయి పడిందని సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్లు సమాచారం. సీఐడీ సత్వర స్పందన చందాదారుల ఫిర్యాదుపై సీఐడీ విభాగం సత్వరం స్పందిస్తోంది. ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయని నిర్ధారణ కాగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. ‘ఘోస్ట్’ చందాదారుడి పేరిట భారీ అక్రమ దందాకు పాల్పడిన కేసులో చీరాల మార్గదర్శి బ్రాంచి మేనేజర్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. సీఐడీకి మార్గదర్శి చందాదారుల ఫిర్యాదుల్లో కొన్ని.. ►విజయనగరంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుడు ఒకరు మొత్తం రూ.6 లక్షలు విలువైన నాలుగు చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చిట్టీ పాట పాడి రెండు ఎల్ఐసీ బాండ్లను ష్యూరిటీగా సమర్పించారు. రూ.5 లక్షలు, రూ.2 లక్షలు విలువైన రెండు బాండ్లను ష్యూరిటీగా ఇచ్చారు. ఆ చిట్టీ గ్రూపుల కాలపరిమితి ముగిసి నెలలు గడుస్తున్నా ఆయనకు ఎల్ఐసీ బాండ్లను తిరిగి ఇవ్వడంలేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్‌ను ఎన్నిసార్లు కలిసినా అరణ్య రోదనగానే మారింది. ►విశాఖపట్నంలో ఒక చందాదారుడు రూ.40 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడిగా చేరారు. 20 నెలలు వాయిదాలు చెల్లించిన తరువాత రూ.8 లక్షల నష్టానికి అంటే రూ.32 లక్షలకు చిట్టీ పాడారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయనకు చిట్టీపాట మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్ సరైన సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఆ చిట్టీగ్రూపులో పెద్ద సంఖ్యలో నకిలీ చందాదారులు ఉన్నట్టు తెలిసింది. ఆ వాయిదాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం చెల్లించడం లేదని చందాదారుడికి తెలిసింది. దీనిపై బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా.. నీకు దిక్కున చోట చెప్పుకో, చిట్టీ మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయాడు. ►బాపట్లలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఒకరు సభ్యుడిగా చేరారు. కొన్ని నెలలు పాటు రూ.40 వేలు వాయిదాలు చెల్లించిన తరువాత ఆయన గ్రూప్ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో మరొకరిని చందాదారుడిగా చేర్చారు. ప్రత్యామ్నాయ చందాదారుడిని చేర్చుకున్న తరువాత వైదొలగిన చందాదారునికి అప్పటికే చెల్లించిన వాయిదాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ఆ మొత్తం వెనక్కి ఇవ్వడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా చందాదారుడే తిరిగి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు రూ.25 వేలు చెల్లించాలని దబాయిస్తున్నారు. ►వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒకరు నాలుగు చిట్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చందా వాయిదా చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా రోజుకు రూ.500 చొప్పున జరిమానా వసూలు చేశారు. ఆ చందాదారుడు ఓ చిట్టీ గ్రూపులో పాట పాడి మూడు నెలలు దాటినా ప్రైజ్‌మనీ ఇవ్వడం లేదు. నిబంధనల మేరకు ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా కంపెనీలో ప్రస్తుతం డబ్బులు లేవని అనధికారికంగా చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయారు. ►విశాఖలో మరో చందాదారుడు రూ.5 లక్షలు చిట్ గ్రూపులో చేరి 38 నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లించారు. తన కుమారుడి చదువు కోసం చిట్టీ పాడేందుకు వెళ్లగా ఆయన పాడేసి డబ్బులు తీసేసుకున్నట్టు రికార్డుల్లో కనిపించింది. ఆయన పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యమే పాట పాడేసి డబ్బులు తీసేసుకున్నట్లు తెలిసింది. హతాశుడైన చందాదారుడు బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వడం లేదు. (((అదో విష వలయం..! ))) మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులను పక్కా పన్నాగంతో అష్టదిగ్బంధనం చేస్తోంది. వారిని శాశ్వత రుణగ్రహీతలుగా మార్చేస్తూ వారి సంపాదననే కాకుండా ఆస్తులను కూడా కాజేస్తోంది. కొందరు చందాదారులను అనధికారికంగా పలు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరుస్తోంది. ఆ విషవలయం నుంచి తప్పించుకోవడం చందాదారుల తరం కావడం లేదు. ఓ బాధితుడు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల బాగోతం బయటపడింది. ►ఓ చందాదారుడు మొత్తం రూ.4.72 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన రూ.3.33 కోట్ల విలువకు చిట్టీ పాటలు పాడారు. అంటే ఆయనకు రూ.3.33 కోట్లు చిట్టీ పాటల మొత్తం (ప్రైజ్‌మనీ)గా రావాలి. కానీ ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చేతిలో పెట్టింది ఎంతో తెలుసా?కేవలం రూ.23లక్షలు. నివ్వెరపోయినచ ఆయన ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆ చందాదారుడికి తెలియకుండా ఆయన్ను ఎందరో చందాదారులకు ష్యూరిటీదారుడిగా నమోదు చేసేశారు. ►గతంలో ఆయనతో ఖాళీ కాగితాలపై తీసుకున్న సంతకాలతోపాటు మరికొన్ని సంతకాలను ఫోర్జరీ చేసి ఇరికించారు. ఆయన 65 చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా చేరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల్లో మాత్రం 90 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు నమోదు చేశారు. అంటే ఆయన సభ్యుడిగా చేరని 25 చిట్టీ గ్రూపులకు కూడా బకాయి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రైజ్‌మనీలో కోత విధించారు. దీనిపై ఆ చందాదారుడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నమోదైన 3 కేసులివీ... ►సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారుడిగా చేర్చారు. బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా ఆయన చందా చెల్లించినట్టు కనికట్టు చేశారు. ఆయన పేరిట ప్రతి నెల డివిడెండ్‌తోపాటు ఒక నెల ప్రైజ్‌మనీ మొత్తాన్ని కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ ఖాతాలో వేసుకుంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే డివిడెండ్లు, ప్రైజ్‌మనీ కొల్లగొట్టి ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. తమ ఆధార్ కార్డును దుర్వినియోగంచేయడంతోపాటు తమకు తెలియకుండా చందాదారుడిగా చేర్చడంపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు చీరాల పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మార్గదర్శి చీరాల శాఖ మేనేజర్ సురేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ►అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తరువాత రూ.4,61,989కు చిట్టీ పాట పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని ఆయన ష్యూరిటీ ఇచ్చిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని ఆయన మొత్తుకున్నా బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలను చూపించి బెదిరించారు. ఆ కాపీలు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ►కోరుకొండ విజయ్‌కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తరువాత 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్ నిరాకరించారు. విజయ్‌కుమార్ తన స్నేహితుడు మల్లికార్జునరావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ప్రైజ్‌మనీ ఇవ్వలేమని చెప్పారు. నిజానికి మల్లికార్జునరావు చిట్టీ గడువు అప్పటికే తీరిపోయింది. తనను మార్గదర్శి యాజమాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్ డిక్లరేషన్‌ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించారు. 49 సబ్స్కైబర్ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్ నిధులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక, గత నవంబర్ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. -
వడ్డీతో పాటు గిఫ్ట్‌లు కూడా ఇస్తానని..
మాచర్ల/రెంటచింతల/వెల్దుర్తి: తాను హైదరాబాద్‌లో చిట్‌ఫండ్ కంపెనీ పెట్టానని, ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే నెలవారీ వడ్డీ చెల్లించడంతో పాటు, భారీగా గిఫ్ట్‌లు కూడా ఇస్తానని ఓ యువకుడు మాచర్లలోని రైతులను మోసం చేశాడు. రూ.లక్షల నుంచి రూ.కోట్లలో నగదు వసూళ్లు చేసి హైదరాబాద్‌లో జల్సాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులు గడుస్తున్నా తాము చెల్లించిన సొమ్ముకు వడ్డీ రాకపోవడం, డబ్బు వసూలు చేసిన వ్యక్తి ఇదిగో.. అదిగో అంటూ మాయమాటలు చెబుతుండటంతో మాచర్ల నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డబ్బులు అడిగితే బెదిరింపులు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన యరగూటి బ్రహ్మానందరెడ్డి పదో తరగతి చదువుకున్నాడు. మాచర్లలో ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. సుమారు ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన ఇతను అక్కడ చిట్‌ఫండ్ కంపెనీ ఏర్పాటు చేశానని ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే నెలకు మూడు రూపాయల చొప్పున వడ్డీ ఇవ్వడంతో పాటు గిఫ్ట్‌లు కూడా ఇస్తానని మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలు, దాచేపల్లి, సహా వివిధ ప్రాంతాల్లోని రైతులను నమ్మించాడు. వారి నుంచి గత మూడేళ్లుగా రూ.కోట్లలో వరకూ డబ్బు వసూళ్లు చేశాడు. వసూలు చేసిన డబ్బుకు నెల నెల వడ్డీ చెల్లించకపోవడం, తొలుత తాను ఇస్తానన్న గిఫ్ట్‌లు కూడా ఇవ్వకపోవడంతో రైతులు అతనిని గతేడాది నుంచి నిలదీస్తూ వస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి కాలం వెల్లదీస్తూ వచ్చాడు. డబ్బు చెల్లించకపోగా, డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగుతుండటంతో చేసేదేమీ లేక రైతులు రెంటచింతల పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
పెట్టుబడులే ముంచేశాయి!
సాక్షి, సిటీబ్యూరో: శ్రీ రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితులు శైలేష్‌కుమార్ గుజ్జర్‌తో పాటు అతడి భార్య నందినిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీరి స్కామ్‌పై మొత్తం మూడు కేసులు నమోదై ఉండగా... రెండింటిలో అభియోగపత్రాలు దాఖలు చేసిన అధికారులు మూడో కేసు దర్యాప్తునూ త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతడి వద్ద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోవడమే స్కామ్‌కు ప్రధాన కారణంగా తేలింది. దీనికితోడు శైలేష్ కుటుంబం గడిపిన విలాస జీవితం, ఇతర వ్యాపారాల్లో వచ్చిన నష్టాలు ఇవన్నీ కలిపి రిషబ్ చిట్‌ఫండ్స్‌ను పూర్తిగా ముంచాయి. ఒకరిని చూసి మరొకరు.. శైలేష్ గుజ్జర్, అతడి భార్య నందిని డైరెక్టర్లుగా 15 ఏళ్ల క్రితం రిషబ్ చిట్‌ఫండ్ సంస్థను ఏర్పాటు చేశారు. తొలినాళ్లల్లో కేవలం చిట్టీలు మాత్రమే నిర్వహించాడు. కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు చిట్టీలు అందుబాటులోకి తేవడం, తదితర కారణాల నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. శైలేష్ కొన్నాళ్లకు చిట్టీలు పాడుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా తీసుకోవడం మొదలెట్టాడు. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా స్వీకరిస్తూ వీరికి నెలకు రూ.2 వడ్డీ ఇస్తానని చెప్పడమేగాక తొలినాళ్లల్లో పక్కాగా చెల్లించాడు. ఈ విషయం ఆ సామాజిక వర్గంలో ప్రాచుర్యం పొందడంతో కేవలం చిట్టీలు వేసి, పాడుకున్న వారే కాకుండా ఇతరులూ భారీగా డిపాజిట్లు చేయడం మొదలెట్టారు. దీంతో నెల వారీగా చెల్లించాల్సిన వడ్డీలు పెరిగిపోవడం, ఆ స్థాయిలో పెట్టుబడుల ద్వారా ఆదాయం లేకపోవడంతో శైలేష్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు ఖరీదైన కార్లు, కుటుంబంతో విలాసవంతమైన జీవితం కోసం భారీగా ఖర్చు చేయడం మొదలైంది. కొన్నాళ్లకు ఈ డిపాజిట్‌దారులకు వడ్డీలు చెల్లించడం కోసం అప్పులు తేవడం, చిట్టీల డబ్బు వాడటం మొదలెట్టాడు. అయినాకు వచ్చే డిపాజిట్లకు వడ్డీలు ఇవ్వలేక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషించాడు. దీనికోసం ఏదైనా భారీ లాభాలు వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, అలా వచ్చే మొత్తంలో డిపాజిట్‌దారులు, చిట్టీలు వేసిన వారికి డబ్బు ఇవ్వాలని భావించాడు. గోవా క్యాసినోలో బుక్కైపోయాడు... శైలేష్ స్నేహితుడైన సురేష్ కుమార్ గోవాలో క్యాసినోలు నిర్వహిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శైలేష్ తాను కూడా ఆ వ్యాపారంలోకి దిగాలని భావించాడు. గోవా ప్రభుత్వం నుంచి క్యాసినోల ఏర్పాటుకు అనుమతి తీసుకోకుండానే తన మకాం అక్కడికి మార్చాడు. ఓ పక్క అనుమతుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ కొనసాగిస్తూ... మరోపక్క అక్కడి నోవాటెల్ హోటల్‌తో పాటు ఓ బీచ్ రిసార్ట్‌లో క్యాసినోల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించాడు. భారీ మొత్తాలు అద్దెలు, లీజుల కోసం చెల్లించి స్థలాలను తీసుకోవడంతో పాటు రెండింటికీ కలిపి రూ.కోట్లు వెచ్చించి ఆధునీకరణ పూర్తి చేశాడు. అలా అత్యాధునిక హంగులతో క్యాసినోలు సిద్ధమైన తర్వాత అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. అయితే హఠాత్తుగా గోవా ప్రభుత్వం క్యానిసోల లైసెన్స్ ఫీజును రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచేసింది. అయితే శైలేష్ అప్పటికే క్యాసినోలు సిద్ధం చేయడానికి రూ.30 కోట్లు వెచ్చించడంతో ఇంత భారీ మొత్తం సమీకరించలేకపోయాడు. అప్పటికే రిషబ్ సంస్థ నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో డిపాజిట్‌దారులు, చిట్టీలు పాడుకున్న వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. నగరంలోనూ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ‘చెయ్యి’ పెట్టినప్పటికీ ఆశించిన లాభాలు రాలేదు. దీంతో తన ఖాతాదారులకు డబ్బు చెల్లించలేక పూర్తిగా చేతులు ఎత్తేసి కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాదాపు రూ.50 కోట్ల వరకు ఉన్న ఈ స్కామ్‌పై మహంకాళి ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శైలేష్, నందినిలను గత ఏడాది డిసెంబర్లో అరెస్టు చేశారు. -
కోల్‌కతాలో ‘దీదీ’గిరి!
కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆదివారం కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న రెండు పోలీసు విభాగాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. అయితే సీబీఐ అధికారుల అరెస్ట్‌పై భిన్న కథనాలు వినిపించాయి. తమ అధికారుల్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని సీబీఐ ఆరోపిం చగా, సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఖండిం చారు. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు తగిన పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించేందుకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆ తరువాత బెంగాల్ పోలీసుల బృందం ఒకటి కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమ అదుపులోకి తీసుకుంది. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు బెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించా లని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ తెలిపింది. శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి పథకాలకు సంబంధించి రాజీవ్‌కుమార్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే అదనుగా బీజే పీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బెంగాల్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని తృణమూల్ ఆరోపించగా, రాజ్యాంగ సమగ్రత, విలువల్ని మమత ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. డ్రామా కొనసాగిందిలా.. కోల్‌కతాలో లౌడాన్ వీధిలోని రాజీవ్‌కుమార్ నివాసానికి సుమారు 40 మంది సీబీఐ అధికారులు చేరుకున్నాక కనీవినీ ఎరుగని హైడ్రామా మొదలైంది. వారు లోనికి వెళ్లకుండా అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని వాకబు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొందరు అధికారుల్ని షేక్స్పియర్ సరాని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే రాజీవ్‌కుమార్ నివాసానికి మరికొందరు సీబీఐ అధికారులు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. వారిలో కొందరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ ముగిశాక సీబీఐ అధికారుల్ని వదిలిపెట్టినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. రహస్య ఆపరేషన్ నిమిత్తం కోల్‌కతాకు వచ్చామని వారు చెప్పారని, అది ఏ రకమైన ఆపరేషనో తమకు తెలియదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతను నివారించడానికి కోల్‌కతా సీబీఐ కార్యాలయం వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. సీబీఐ దాడులు ఊహించాం: మమతా బెనర్జీ రాజీవ్‌కుమార్ నివాసం బయట హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. ‘చేతులకు రక్తపు మరకలు అంటుకున్న అలాంటి ప్రధానితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది. జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీ తరువాత సీబీఐతో దాడులు చేయిస్తారని మాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిట్‌ఫండ్ కంపెనీల యజమానుల్ని అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసింది మేమే’ అని మమతా బెనర్జీ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిహసించారు: బీజేపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్‌ఫండ్ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్‌కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. బెంగాల్లో శాంతి, భద్రతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించింది. మమతకు విపక్షాల బాసట.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆమెకు ఫోన్‌చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ శక్తుల్ని ఓడిస్తామని రాహుల్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లుపొడిచారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోదీ–షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్లో సీబీఐ చర్యను ఖండించాలని అన్నారు. సీబీఐ నోటీసులకు స్పందించని కమిషనర్ శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ కేసులకు సంబంధించి గల్లంతయిన కొన్ని పత్రాల విషయమై ఆయనని విచారించాల్సి ఉందని సీబీఐ ప్రకటించింది. తమ ముందు హాజరుకావాలని సీబీఐ పలు నోటీసులు పంపినా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు ఇటీవల ఎన్నికల సంఘం కోల్‌కతాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి రాజీవ్‌కుమార్ హాజరుకాలేదు. అయితే రాజీవ్‌కుమార్ విధులకు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్తల్ని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన కోల్‌కతాలోనే ఉన్నారని, రోజూవారీ విధులకు హాజరువుతున్నారని ప్రకటన విడుదల చేశారు. సీబీఐ అధికారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
వైరా చిట్‌ఫండ్ మోసగాళ్లకు జైలుశిక్ష
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపుగా 400మంది నుంచి చిట్టీల రూపంలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి, టోపీ పెట్టిన కేసులో వైరాలోని సాయిప్రసన్న చిట్‌ఫండ్ నిర్వాహకులు ముగ్గురికి జైలు శిక్ష, భారీగా జరిమానా పడింది. ఈ మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ మంగళవారం తీర్పుచెప్పారు. ఖమ్మంలీగల్ : దొండిగర్ల బాలశౌరి, అతని కుటుంబీకులు కలిసి వైరాలో సాయి ప్రసన్న చిట్‌ఫండ్ పేరుతో 1996లో వ్యాపారం ప్రారంభించారు. సుమారు పదేళ్లపాటు సాగించారు. చందాదారులకు నమ్మకం కలిగించారు. ఈ చందాదారుల్లో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. చిట్టీ డబ్బుల కింద వీరిలో అనేకమందికి చిట్‌ఫండ్ నిర్వాహకులు చెక్కులు ఇచ్చారు. అవి చెల్లలేదు. చందాదారులు ఒత్తిడి చేయడంతో.. ‘‘నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. మీ డబ్బుకు ఎటువంటి ఢోకా లేదు’’ అంటూ అందరినీ బాలశౌరి నమ్మించాడు. ∙2010, డిసెంబర్ 16న ఇతడి కుటుంబం మొత్తం వైరాలోని ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత, వైరాలోని పెద్దలు పంచాయితీ పెట్టారు. వైరాలోగల ఆస్తులను అమ్మి, ఎవరి డబ్బు వారికి ఇస్తామని బాలశౌరి, ఆయన పెద్ద కుమారుడు వరప్రసాద్ హామీ ఇచ్చారు. ఇదంతా 2011 వరకు సాగింది. చెప్పిన ప్రకారంగా బాలశౌరి, ఆయన కుమారుడు.. బాధితులకు డబ్బు ఇవ్వలేదు. దీంతో దాదాపుగా 400 బాధితుల తరఫున కలిసి వైరా పోలీసులకు రాయల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. కోర్టులో చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. మొత్తం 49మంది సాక్షులుగా చూపించారు. ఈ కేసులో తీర్పును మంగళవారం న్యాయమూర్తి వెలువరించారు. నేరం రుజువైందని నిర్థారించారు. బాలశౌరికి ఐపీసీ 406 సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25లక్షల జరిమానా, 420 ఐపీసీ కింద ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా, సెక్షన్ 5 ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 కింద ఏడేళ్ల జైలుశిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించారు. మరో నిందితురాలు దొడ్డిగర్ల శాంతకు ఐపీసీ 406 సెక్షన్ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్ 5 ఏపీపీ డీఎఫ్ఈ యాక్ట్ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. నాలుగో నిందితుడైన దొడ్డిగొర్ల ప్రసన్నకుమార్‌కు ఐపీసీ 406 సెక్షన్ కింద రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.12లక్షల జరిమానా, ఐపీసీ 420 కింద మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20లక్షల జరిమానా, సెక్షన్ 5 ఏపీపీ డీఎఫ్ఈ యాక్ట్ 1999 కింద నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధించారు. మూడవ నిందితుడైన దొడ్డిగర్ల వరప్రసాద్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆర్.ఉపేందర్ వ్యవహరించారు. లైజన్ ఆఫీసర్ పి.భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్ కె.చెన్నారావు, హోంగార్డ్ ఎస్డి.యూసుఫ్ సహకరించారు. -
చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో తగినంత ఆధారాలు సేకరించేందుకు పోలీసు పరిశోధనాధికారులు కృషి చేయాలని ఎస్పీ బి.అనురాధ సూచించారు. జిల్లా పోలీసు కార్యాల యం లో శనివారం ఉదయం ‘చిట్‌ఫండ్ వ్యవహారాల్లో జరిగే మోసాలు–ప్రజలకు చేయాల్సిన న్యాయ సేవలు, ఇతర చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు అధికారులు నూతన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సాక్షాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీధర్, పీపీపీబాలగంగాధర్రెడ్డి, ఏపీపీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చిక్కిన సేవా‘చీట్’ ఫండ్ యజమాని ?
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్‌ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్‌కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరిపై కేసులు? సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది పలువురు ఏజెంట్లపై కూడా... సేవా చిట్‌ఫండ్‌లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా విచారిస్తున్నాం సేవా చిట్‌ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్‌ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్‌ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. -
శారదా చిట్‌ఫండ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
ఐదు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది మదుపుదారుల నెత్తిన టోపీ పెట్టి, వాళ్లందరినీ దివాలా తీయించిన శారదా చిట్‌ఫండ్స్ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేస్తుంది. పశ్చిమబెంగాల్, ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు చెందిన సీబీఐ అధికారులు ఇందులోభాగంగా ఉంటారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలుచేసే ముందు సంబంధిత పత్రాలన్నింటినీ సిట్ సేకరిస్తుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. తీవ్ర రాజకీయ దుమారానికి కూడా కారణమైన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 9వ తేదీన సీబీఐకి అప్పగించింది. పశ్చిమబెంగాల్, ఒడిషా, త్రిపుర, జార్ఖండ్, అసోం రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ఈ స్కాము కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు. చిట్‌ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో శారదా గ్రూపు చైర్మన్ సుదీప్త సేన్‌కు కోల్‌కతాలోని ఓ ఓ కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది.