శైలేష్ కుమార్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: శ్రీ రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితులు శైలేష్‌కుమార్ గుజ్జర్‌తో పాటు అతడి భార్య నందినిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీరి స్కామ్‌పై మొత్తం మూడు కేసులు నమోదై ఉండగా... రెండింటిలో అభియోగపత్రాలు దాఖలు చేసిన అధికారులు మూడో కేసు దర్యాప్తునూ త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతడి వద్ద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోవడమే స్కామ్‌కు ప్రధాన కారణంగా తేలింది. దీనికితోడు శైలేష్ కుటుంబం గడిపిన విలాస జీవితం, ఇతర వ్యాపారాల్లో వచ్చిన నష్టాలు ఇవన్నీ కలిపి రిషబ్ చిట్‌ఫండ్స్‌ను పూర్తిగా ముంచాయి.
ఒకరిని చూసి మరొకరు..
శైలేష్ గుజ్జర్, అతడి భార్య నందిని డైరెక్టర్లుగా 15 ఏళ్ల క్రితం రిషబ్ చిట్‌ఫండ్ సంస్థను ఏర్పాటు చేశారు. తొలినాళ్లల్లో కేవలం చిట్టీలు మాత్రమే నిర్వహించాడు. కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు చిట్టీలు అందుబాటులోకి తేవడం, తదితర కారణాల నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. శైలేష్ కొన్నాళ్లకు చిట్టీలు పాడుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా తీసుకోవడం మొదలెట్టాడు. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా స్వీకరిస్తూ వీరికి నెలకు రూ.2 వడ్డీ ఇస్తానని చెప్పడమేగాక తొలినాళ్లల్లో పక్కాగా చెల్లించాడు. ఈ విషయం ఆ సామాజిక వర్గంలో ప్రాచుర్యం పొందడంతో కేవలం చిట్టీలు వేసి, పాడుకున్న వారే కాకుండా ఇతరులూ భారీగా డిపాజిట్లు చేయడం మొదలెట్టారు. దీంతో నెల వారీగా చెల్లించాల్సిన వడ్డీలు పెరిగిపోవడం, ఆ స్థాయిలో పెట్టుబడుల ద్వారా ఆదాయం లేకపోవడంతో శైలేష్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు ఖరీదైన కార్లు, కుటుంబంతో విలాసవంతమైన జీవితం కోసం భారీగా ఖర్చు చేయడం మొదలైంది. కొన్నాళ్లకు ఈ డిపాజిట్‌దారులకు వడ్డీలు చెల్లించడం కోసం అప్పులు తేవడం, చిట్టీల డబ్బు వాడటం మొదలెట్టాడు. అయినాకు వచ్చే డిపాజిట్లకు వడ్డీలు ఇవ్వలేక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషించాడు. దీనికోసం ఏదైనా భారీ లాభాలు వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, అలా వచ్చే మొత్తంలో డిపాజిట్‌దారులు, చిట్టీలు వేసిన వారికి డబ్బు ఇవ్వాలని భావించాడు.
గోవా క్యాసినోలో బుక్కైపోయాడు...
శైలేష్ స్నేహితుడైన సురేష్ కుమార్ గోవాలో క్యాసినోలు నిర్వహిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శైలేష్ తాను కూడా ఆ వ్యాపారంలోకి దిగాలని భావించాడు. గోవా ప్రభుత్వం నుంచి క్యాసినోల ఏర్పాటుకు అనుమతి తీసుకోకుండానే తన మకాం అక్కడికి మార్చాడు. ఓ పక్క అనుమతుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ కొనసాగిస్తూ... మరోపక్క అక్కడి నోవాటెల్ హోటల్‌తో పాటు ఓ బీచ్ రిసార్ట్‌లో క్యాసినోల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించాడు. భారీ మొత్తాలు అద్దెలు, లీజుల కోసం చెల్లించి స్థలాలను తీసుకోవడంతో పాటు రెండింటికీ కలిపి రూ.కోట్లు వెచ్చించి ఆధునీకరణ పూర్తి చేశాడు. అలా అత్యాధునిక హంగులతో క్యాసినోలు సిద్ధమైన తర్వాత అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. అయితే హఠాత్తుగా గోవా ప్రభుత్వం క్యానిసోల లైసెన్స్ ఫీజును రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచేసింది. అయితే శైలేష్ అప్పటికే క్యాసినోలు సిద్ధం చేయడానికి రూ.30 కోట్లు వెచ్చించడంతో ఇంత భారీ మొత్తం సమీకరించలేకపోయాడు. అప్పటికే రిషబ్ సంస్థ నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో డిపాజిట్‌దారులు, చిట్టీలు పాడుకున్న వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. నగరంలోనూ ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో ‘చెయ్యి’ పెట్టినప్పటికీ ఆశించిన లాభాలు రాలేదు. దీంతో తన ఖాతాదారులకు డబ్బు చెల్లించలేక పూర్తిగా చేతులు ఎత్తేసి కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాదాపు రూ.50 కోట్ల వరకు ఉన్న ఈ స్కామ్‌పై మహంకాళి ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శైలేష్, నందినిలను గత ఏడాది డిసెంబర్‌లో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment