బాధితులతో మాట్లాడుతున్న డీఎస్పీ రమణారెడ్డి
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్‌ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్‌కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.
సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు
సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది.
కుటుంబ సభ్యులందరిపై కేసులు?
సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది
పలువురు ఏజెంట్లపై కూడా...
సేవా చిట్‌ఫండ్‌లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు.
అన్ని విధాలుగా విచారిస్తున్నాం
సేవా చిట్‌ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్‌ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్‌ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment