ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కోదాడ : మద్యం తాగి ఆస్తిని తగలేస్తున్నాడని.. మరో మహిళతో కూడా సఖ్యతగా మెలుగుతున్నాడని ఓ మహిళ భర్తపై కోపం పెంచుకుంది. ఆస్తిని రక్షించుకునేందుకు చివరకు అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. మరికొందరి సహకారం తీసుకుని ప్రణాళిక ప్రకారం దాడి చేసినా బాధితుడు తప్పించుకున్నాడు. డామిట్ కథ అడ్డం తిరిగినట్లు చివరకు హత్యాయత్నం కుట్రలో సూత్రధారి అయిన భార్యతో పాటు సహకరించిన మరో ఎనిమిది మంది కటకటాలపాలయ్యారు.
బుధవారం రూరల్ ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వు మండలం రామాపురం గ్రామానికి చెందిన మేకల సత్యనారాయణ, అతడి భార్య కనకదుర్గకు ఆస్తి విషయంలో గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కనకదుర్గ కోదాడలో తనకు తెలిసిన ఓ యూట్యూబ్ చానల్ విలేకరిగా పనిచేస్తున్న గంధం వెంకటనారాయణను సంప్రదించింది. వారిద్దరూ సహకారం అందించాలని న్యాయవాది పాలేటి రామారావును కోరారు. మా డ్రైవర్ వీరబాబు అయితే ఇలాంటి పనులు చేస్తాడని రూ.50వేలకు హత్య చేసేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వీరబాబు తనకు తెలిసిన త్రివేణిబాబుతో పాటు హుజూర్‌నగర్‌కు చెందిన గోపి, హనీ, అనంతగిరికి చెందిన జానీ వెల్లటూరుకు చెందిన శ్రీనులకు విషయం చెప్పి అతడి ఫొటో చూపించి హత్యకు ప్లాన్ వేశారు.
కారు ఆపి.. ఇనుప రాడ్లతో దాడి చేసి..
సత్యనారాయణ గత డిసెంబర్ 7న రామాపురం వెళ్తున్న విషయాన్ని నిందితులు తెలుసుకున్నారు. రామాపురం నుంచి తిరిగి కారులో కోదాడ వైపునకు వస్తున్నాడని తెలుసుకుని రాత్రి ఏడు గంటల సమయంలో కోదాడ మండలం కూచిపూడి శివారులో బైక్‌లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కారును అడ్డగించి అద్దాలు పగొలగొట్టి బయటకు లాగి రాడ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ కారులో ఉన్న మరో మహిళ అరవడంతో సత్యనారాయణ చనిపోయాడులే అని అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం విషయాన్ని న్యాయవాదికి తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు విచారణ చేపట్టారు. ఈ కేసులో సెల్‌ఫోన్ కాల్‌డేటాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్యాయత్నం కేసును ఛేదించారు. హత్యలో భాగస్వాములుగా ఉన్న 9మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment