మేమూ ‘మార్గదర్శి’లో చేరాం.. మోసపోయాం.. సీఐడీ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ | Ramoji Rao Margadarsi Chit Fund Scam Case Latest Update, Subscribers Complaining To The CID - Sakshi
Sakshi News home page

Margadarsi Scam Case: మేమూ ‘మార్గదర్శి’లో చేరాం.. మోసపోయాం.. సీఐడీ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ

Published Wed, Aug 23 2023 3:22 AM | Last Updated on Wed, Aug 23 2023 11:52 AM

Ramoji Rao Margadarsi Chit Fund Scam Case Latest Update  - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘నేనూ మార్గదర్శిలో చేరా... ఓ మోపెడ్‌ కొనుక్కున్నా!.. ఓ ఇంటి వాడినయ్యా..!!’’ ఇలాంటి ప్రకటనలను నమ్మిన వేలాది మంది మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ చందాదారులు నిండా మునిగిపోయారు! ప్రతి నెలా కష్టార్జితం నుంచి పొదుపు చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు కడితే దారుణంగా మోసపోయామని ఆక్రోశిస్తున్నారు.

చందాదారుల సొమ్మును తన కుటుంబ సభ్యుల సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేసిన రామోజీ­రావు తాపీగా కూర్చోగా చందాదారులు మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు తీసుకుని కూడా డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు... మరికొందరు చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్‌ మనీ) ఇవ్వ­కుండా నెలల తరబడి తిప్పుతున్నారు.. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీగా చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని నెలల తరబడి జాప్యం చేస్తున్నా ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించడం లేదు.. ఇలా వేలాదిమంది 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసులను నమోదు చేసి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. మరోవైపు రాష్ట్రంలో నలుమూలల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద ఎత్తున సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కో చందాదారుడిది ఒక్కో వ్యధ!

మూడు రోజుల్లో 300కిపైగా ఫిర్యాదులు
మోసపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు ఫిర్యాదు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. చందాదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబరు ( 9493174065 ) అందుబాటులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద సంఖ్యలో సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్‌ నంబర్‌ అందుబాటులోకి రాకముందు సీఐడీకి దాదాపు వందకుపైగా ఫిర్యాదులు రాగా ఇప్పుడు మూడు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా చందాదారులు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చందాదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. 

చందాదారుల సొమ్ము సొంతానికి... మార్గదర్శి దివాళా అంచుకు
కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రామోజీరావు పాల్పడిన ఆర్థిక అక్రమాలతో చందాదారులు నిండా మోసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల సొమ్మును రామోజీరావు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్‌లలో పెట్టుబడిగా పెట్టారు. మరికొన్ని నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులుగా తరలించేశారు. దాదాపు 2 వేలకుపైగా ఉన్న చిట్టీ గ్రూపుల చందాదారులు చెల్లించే చందా మొత్తంలో కొంత మొత్తాన్ని అటూఇటూ రొటేషన్‌ చేస్తూ దశాబ్దాలుగా మోసం చేస్తూ వచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాలు బయటపడటంతో 2022 నవంబరు నుంచి కొత్త చిట్టీలు నిలిచిపోయాయి.

మరోవైపు భారీగా చందాదారుల సొమ్మును రామోజీ తమ పేరిట స్థిర, చరాస్తులుగా మార్చేశారు. దీంతో ప్రసుత్తం చిట్టీ గ్రూపుల్లో ఉన్న దాదాపు 50 వేల మంది చందాదారులకు ప్రైజ్‌మనీని చెల్లించలేక మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చేతులెత్తేసింది. గత్యంతరం లేక దిక్కులు చూస్తోంది. రాష్ట్రంలోని 37 బ్రాంచీల పరిధిలో దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్‌ మనీ చెల్లించడం లేదని సమాచారం. గత 9 నెలల్లో రూ.1,620 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మరోవైపు రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని కూడా కాలపరిమితి ముగిసినా చెల్లించడం లేదు. వెరసి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బకాయి పడిందని సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్లు సమాచారం. 

సీఐడీ సత్వర స్పందన
చందాదారుల ఫిర్యాదుపై సీఐడీ విభాగం సత్వరం స్పందిస్తోంది. ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయని నిర్ధారణ కాగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపడుతోంది. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. ‘ఘోస్ట్‌’ చందాదారుడి పేరిట భారీ అక్రమ దందాకు పాల్పడిన కేసులో చీరాల మార్గదర్శి బ్రాంచి మేనేజర్‌కు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.
 
సీఐడీకి మార్గదర్శి చందాదారుల ఫిర్యాదుల్లో కొన్ని.. 
విజయనగరంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుడు ఒకరు మొత్తం రూ.6 లక్షలు విలువైన నాలుగు చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చిట్టీ పాట పాడి రెండు ఎల్‌ఐసీ బాండ్లను ష్యూరిటీగా సమర్పించారు. రూ.5 లక్షలు, రూ.2 లక్షలు విలువైన రెండు బాండ్లను ష్యూరిటీగా ఇచ్చారు. ఆ చిట్టీ గ్రూపుల కాలపరిమితి ముగిసి నెలలు గడుస్తున్నా ఆయనకు ఎల్‌ఐసీ బాండ్లను తిరిగి ఇవ్వడంలేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్‌ను ఎన్నిసార్లు కలిసినా అరణ్య రోదనగానే మారింది.

విశాఖపట్నంలో ఒక చందాదారుడు రూ.40 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడిగా చేరారు. 20 నెలలు వాయిదాలు చెల్లించిన తరువాత రూ.8 లక్షల నష్టానికి అంటే రూ.32 లక్షలకు చిట్టీ పాడారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయనకు చిట్టీపాట మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్‌ సరైన సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఆ చిట్టీగ్రూపులో పెద్ద సంఖ్యలో నకిలీ చందాదారులు ఉన్నట్టు తెలిసింది. ఆ వాయిదాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమాన్యం చెల్లించడం లేదని చందాదారుడికి తెలిసింది. దీనిపై బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా.. నీకు దిక్కున చోట చెప్పుకో, చిట్టీ మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయాడు. 

బాపట్లలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఒకరు సభ్యుడిగా చేరారు. కొన్ని నెలలు పాటు రూ.40 వేలు వాయిదాలు చెల్లించిన తరువాత ఆయన గ్రూప్‌ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో మరొకరిని చందాదారుడిగా చేర్చారు. ప్రత్యామ్నాయ చందాదారుడిని చేర్చుకున్న తరువాత వైదొలగిన చందాదారునికి అప్పటికే చెల్లించిన వాయిదాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ఆ మొత్తం వెనక్కి ఇవ్వడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా చందాదారుడే తిరిగి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు రూ.25 వేలు చెల్లించాలని దబాయిస్తున్నారు. 

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒకరు నాలుగు చిట్‌ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చందా వాయిదా చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా రోజుకు రూ.500 చొప్పున జరిమానా వసూలు చేశారు. ఆ చందాదారుడు ఓ చిట్టీ గ్రూపులో పాట పాడి మూడు నెలలు దాటినా ప్రైజ్‌మనీ ఇవ్వడం లేదు. నిబంధనల మేరకు ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా కంపెనీలో ప్రస్తుతం డబ్బులు లేవని అనధికారికంగా చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయారు.

విశాఖలో మరో చందాదారుడు రూ.5 లక్షలు చిట్‌ గ్రూపులో చేరి 38 నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లించారు. తన కుమారుడి చదువు కోసం చిట్టీ పాడేందుకు వెళ్లగా ఆయన పాడేసి డబ్బులు తీసేసుకున్నట్టు రికార్డుల్లో కనిపించింది. ఆయన పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమాన్యమే పాట పాడేసి డబ్బులు తీసేసుకున్నట్లు తెలిసింది. హతాశుడైన చందాదారుడు బ్రాంచి మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వడం లేదు. 

(((అదో విష వలయం..! )))
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారులను పక్కా పన్నాగంతో అష్టదిగ్బంధనం చేస్తోంది. వారిని శాశ్వత రుణగ్రహీతలుగా మార్చేస్తూ వారి సంపాదననే కాకుండా ఆస్తులను కూడా కాజేస్తోంది. కొందరు చందాదారులను అనధికారికంగా పలు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరుస్తోంది. ఆ విషవలయం నుంచి తప్పించుకోవడం చందాదారుల తరం కావడం లేదు. ఓ బాధితుడు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల బాగోతం బయటపడింది. 

ఓ చందాదారుడు మొత్తం రూ.4.72 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన రూ.3.33 కోట్ల విలువకు చిట్టీ పాటలు పాడారు. అంటే ఆయనకు రూ.3.33 కోట్లు చిట్టీ పాటల మొత్తం (ప్రైజ్‌మనీ)గా రావాలి. కానీ ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చేతిలో పెట్టింది ఎంతో తెలుసా?కేవలం రూ.23లక్షలు. నివ్వెరపోయినచ ఆయన ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆ చందాదారుడికి తెలియకుండా ఆయన్ను ఎందరో చందాదారులకు ష్యూరిటీదారుడిగా నమోదు చేసేశారు.

గతంలో ఆయనతో ఖాళీ కాగితాలపై తీసుకున్న సంతకాలతోపాటు మరికొన్ని సంతకాలను ఫోర్జరీ చేసి ఇరికించారు. ఆయన 65 చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా చేరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రికార్డుల్లో మాత్రం 90 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు నమోదు చేశారు. అంటే ఆయన సభ్యుడిగా చేరని 25 చిట్టీ గ్రూపులకు కూడా బకాయి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రైజ్‌మనీలో కోత విధించారు. దీనిపై ఆ చందాదారుడు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే నమోదైన 3 కేసులివీ...
సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారుడిగా చేర్చారు. బుక్‌ అడ్జస్ట్‌మెంట్ల ద్వారా ఆయన చందా చెల్లించినట్టు కనికట్టు చేశారు. ఆయన పేరిట ప్రతి నెల డివిడెండ్‌తోపాటు ఒక నెల ప్రైజ్‌మనీ మొత్తాన్ని కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ ఖాతాలో వేసుకుంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే డివిడెండ్లు, ప్రైజ్‌మనీ కొల్లగొట్టి ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. తమ ఆధార్‌ కార్డును దుర్వినియోగంచేయడంతోపాటు తమకు తెలియకుండా చందాదారుడిగా చేర్చడంపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు చీరాల పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మార్గదర్శి చీరాల శాఖ మేనేజర్‌ సురేంద్రను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తరువాత రూ.4,61,989కు చిట్టీ పాట పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని ఆయన ష్యూరిటీ ఇచ్చిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని ఆయన మొత్తుకున్నా బ్రాంచి మేనేజర్‌ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలను చూపించి బెదిరించారు. ఆ కాపీలు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

కోరుకొండ విజయ్‌కుమార్‌ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తరువాత 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్‌ నిరాకరించారు. విజయ్‌కుమార్‌ తన స్నేహితుడు మల్లికార్జునరావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ప్రైజ్‌మనీ ఇవ్వలేమని చెప్పారు. నిజానికి మల్లికార్జునరావు చిట్టీ గడువు అప్పటికే తీరిపోయింది. తనను మార్గదర్శి యాజమాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement