► వైద్యం అందక చిన్నారుల అవస్థలు
► నర్సులే వైద్యం చేస్తున్న వైనం
► ఆందోళనలో తల్లిదండ్రులు
నెల్లూరు (అర్బన్) : డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడకల్ ఎడ్యుకేషన్)లోకి ఆసుపత్రుల విలీనం రోగుల పాలిట శాపంలా మారింది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఒకే చోట మెటర్నటీ, చిన్న పిల్లల ఆసుపత్రుల ఉండాలని జీజీహెచ్ ఆవరణలోని ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రికి జూబ్లీను మారుస్తున్నారు. తాజాగా నగరంలోని స్టోన్‌హోస్‌పేట వద్ద ఉన్న రేబాల చిన్న పిల్లల ఆసుపత్రిని కొత్త ఆసుపత్రికి మారుస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వస్తున్న చిన్నారులు అల్లాడిపోతున్నారు.
నిరీక్షించాల్సిందే...
రేబాల ఆసుపత్రిని ప్రభుత్వాస్పత్రికి మార్చామని, ఓపీ, అడ్మిషన్ల అక్కడే చూస్తారని చాలా రోజుల కిందటే బ్యానర్‌ను అంటించారు. సిబ్బంది కొంత మందిని తరలించారు. కొత్త ఆసుపత్రిలో రోగులను చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చే వరకు రేబాలలో ఓపీల వరకు చూడాలని భావించారు. కేవలం ఒకరిద్దరు డాక్టర్లను, మరికొంత సిబ్బందిని మాత్రమే అందుబాటులో ఉంచారు. ఒకరిద్దరు నర్సులే పిల్లలను పరీక్షిస్తున్నట్లు సమాచారం. తమ వల్ల కాకపోతే కొత్త ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. మందులు సైతం లేవని చెబుతున్నారు.
అంతా గందరగోళం....
ఆసుపత్రుల తరలింపు మొత్తం పూర్తిగా గందరగోళంగా సాగుతోంది. జూబ్లీకి, రేబాలకు రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అధికారులు వాళ్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మొక్కుబడిగా ఆసుపత్రులను తరలిస్తున్నారు. పలువురు డాక్టర్లు సంతకాలు పెట్టి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడంలేదు. రెండు ఆసుపత్రుల్లో వైద్య సేవలను అనధికారికంగా బంద్ చేయించిన అధికారులు కొత్త ఆసుపత్రిలో సౌకర్యాలను త్వరగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.
రోగులకు శాపంలా ఆస్పత్రుల విలీనం
Published Sun, May 17 2015 5:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement