ప్రమాదాలను కూడా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. వర్షాకాలంలో పాముకాటుకు గురైన వారు ఎక్కువగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది వైద్య సిబ్బంది దానికి విరుగుడుగా వాడే ఏవీఎస్ ఇంజక్షన్లను బయటకు అమ్ముకుంటున్నారు. పాముకాటుకు గురైన వారి సంఖ్య... వాడిన ఇంజక్షన్ల సంఖ్యకు మధ్య తేడా ఉండడమే దీనికి నిదర్శనం.
సాక్షి, మహబూబ్‌నగర్: అది చాలా అరుదుగా వినియోగించే మందు.. ఓ మాటలో చెప్పాలంటే పాముకాటు బాధితులకు ప్రాణం పోసే దివ్య ఔషధం. ఇంతటి విలువైన యాంటీ స్నేక్ వీనమ్(ఏవీఎస్) వాయల్స్ జిల్లా ఆస్పత్రిలో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాటుకాటు బాధితుల సంఖ్య, వినియోగించిన ఏవీఎస్ వాయల్స్‌ను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పాటుకాటు బారినపడే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తుంటాయి. దీనినుంచి బాధితులను రక్షించేందుకు విరుగుడుగా ఉపయోగించే యాంటీ స్నేక్ వీనమ్ మందును ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతుంది. కానీ మహబూబ్‌నగర్‌లోని ప్రధాన ఆస్పత్రి నుంచి బహిరంగమార్కెట్‌కు అవి తరలుతున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.. జిల్లా ఆస్పత్రిలోని రిజిస్టర్‌లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది అన్ని పీహెచ్‌సీలలో కలిపి 41కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కార్యాలయం పేర్కొంది. కానీ జిల్లా ఆస్పత్రిలో మాత్రం ఇప్పటివరకు 247 పాముకాటు కేసులను నమోదు చేశారు. అయితే ఇక్కడ విషయమేమంటే పాముకాటుకు గురవుతున్న వారి ఎక్కువగా గ్రామీణులే ఉంటున్నారు. వారు మొదట పీహెచ్‌సీలను ఆశ్రయిస్తారు. అక్కడ సరైన సదుపాయాలు కల్పించలేని పక్షంలో ఏరియా ఆస్పత్రికి.. లేదంటే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కానీ పీహెచ్‌సీల్లో నమోదైన కేసుల కంటే జిల్లా ఆస్పత్రిలో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే వెయ్యి ఏవీఎస్ వాయల్స్ ఉపయోగించినట్లు రికార్డుల్లో పొందుపరిచారు.
గతేడాది అంతే : 2013లో జిల్లాలో పీహెచ్‌సీల్లో 196 కేసులు నమోదైతే, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో 474మంది బాధితులకు చికిత్స అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 2,809 ఏవీఎస్‌లను ఉపయోగించినట్లు లెక్కలు వేశారు. అయితే ఈ విషయమై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ విచారణ కూడా చేపట్టింది. సంస్థ ఎండీ స్వయంగా స్థానిక ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. అప్పట్లో అవకతవకలు జరిగాయా? లేదా అన్నది మాత్రం బయటకు వెలువడలేదు. తాజాగా ఇదే ఆస్పత్రిలో నమోదైన పాముకాటు కేసులకు మించి ఏవీఎస్‌లను వినియోగించడాన్ని చూస్తే మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కొందరి చేతివాటం వల్ల ఈ విలువైన మందు పక్కదారి పడుతుందనే విషయం తేటతెల్లమవుతోంది.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
ఆస్పత్రి నుంచి మందులు బయట కు వెళ్లే ప్రసక్తేలేదు. యాంటీ స్నేక్ వీనమ్ మెడిసిన్ పక్కదారి పడుతున్నదన్నది అవాస్తవం. మా దగ్గరికొచ్చే పేషెంట్ల వివరాలు, వారికిచ్చిన వాయల్స్ లెక్క కచ్చితంగా పాటిస్తున్నాం. ప్రభుత్వ లేబల్ ఉన్న ఏవీఎస్ బయట ఎక్కడైనా ప్రైవేట్‌ఆస్పత్రుల్లో కానీ నర్సింగ్‌హోముల్లో ఉన్నట్లు బయటపడలేదు. ఒకవేళ జిల్లా ఆస్పత్రి నుంచి మందులు బయటకు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- శ్యాముల్స్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
ఏవీఎస్.. పక్కదారి?
Published Sun, Jul 27 2014 2:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement