మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు తల్లికడుపులోనే మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పాతపాలమూర్‌లోని గోల్‌మజీద్ ప్రాంతానికి చెందిన ఆఫ్రిన్‌సుల్తానా గర్భిణి.. పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను మంగళవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మధ్యాహ్నం రెండుగంటల వరకు కూడా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. బాధితురాలు నొప్పులతో బాధపడుతుంటే బెడ్‌లేదు.. ఓ మూలన పడుకో అని నిర్లక్ష్యంగా ప్రసూతి వార్డులో పనిచేస్తున్న నర్సులు, ఆయాలు గద్దించారు.
ఆ తరువాత డ్యూటీకి వచ్చిన వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. అప్పటికే బాధితురాలు తీవ్రమైన రక్తస్రావానికి గురైంది. ఆ సమయంలోనే కడుపులోఉన్న ఆడ శిశువు మృతి చెందింది. ఇది తెలియని ఓ వైద్యుడు బాధితురాలి ఆరోగ్యపరిస్థితి చూడకుండానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్డు తీసుకురావాలని సూచించారు. బాధితులు ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్‌కు విషయాన్ని తెలిపారు.
దీంతో ఆయన లేబర్ రూమ్‌కు ఫోన్ చేశారు. అక్కడి సబ్బంది పోన్ ఎత్తకపోవడంతో ఆయనే స్వయంగా లేబర్‌రూమ్‌కు వెళ్లి వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాధితురాలికి వైద్య చికిత్సలు అందించి కడుపులోఉన్న మృత శిశువును తొలగించారు.
ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం
Published Wed, Oct 2 2013 3:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement