doctors negligence
-
ప్రాణం పోయమంటే... పేగులు తోడేశారు
అనంతపురం మెడికల్: జీవి పుట్టుకకు దేవుడు కారణమైతే... ఆ జీవి ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడిపేందుకు వైద్యులు కారణమై దేవుడితో సమానంగా ఖ్యాతి దక్కించుకున్నారు. అయితే కొందరు వైద్యుల కారణంగా ఈ ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతోంది. ఇందుకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో సర్జరీ విభాగం సేవలే నిదర్శనం. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి వార్డుకు తరలిస్తే పేగులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...కణేకల్లు మండలం బెన్నికల్కు చెందిన వృద్ధుడు హనుమప్ప కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గత నెల సర్వజనాస్పత్రికి పిలుచుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గత నెల 25న యూనిట్ 2 కింద అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంటర్ స్టైనల్ ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పి వస్తోందని గుర్తించి లాపరోటమీ సర్జరీ (పొత్తికడుపు ఓపెన్ సర్జరీ) చేసి ఎస్ఐసీయూకు తరలించారు. ఐసీయూకు తరలించిన అదే రోజు హనుమప్పకు సర్జరీ వైద్యులు వేసిన కుట్లు తెరుచుకుని కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు, పక్కనే ఉన్న రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.వార్డులోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి విషయాన్ని వెంటనే వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అనస్తీసియా నుంచి బయటపడిన హనుమప్ప నొప్పి భరించలేక కేకలు వేస్తుండడంతో ఎస్ఐసీయూలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైద్యులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇదేమిటని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ఆరా తీస్తే హనుమప్పకదలడం, ఆయాసం అధికంగా కావడంతో పేగులు బయట పడ్డాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ఈ అంశం వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హనుమప్ప కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. కాగా, యూనిట్ 2 వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శస్త్రచికిత్స విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సర్జరీ విభాగంలో సరైన ప్రమాణాలను వైద్యులు పాటించడం లేదని ఆస్పత్రి వర్గాలే బాహటంగా చెబుతున్నాయి. సీనియర్లు చేయాల్సిన సర్జరీని పీజీ వైద్య విద్యార్థులతో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వజనాస్పత్రిలో సర్జరీ విభాగం వైఫల్యాలపై ఆస్పత్రి పాలక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్‌ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు. ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో విషాదం.. ఇద్దరు బాలింతలు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపుతోంది. బాధిత బంధువుల ఆందోళనతో అస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల రెండో కాన్పు కోసం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెంగ్యూ జ్వరం ఉన్నది గుర్తించకుండా డెలీవరీ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. వెంటనే బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్లేట్స్ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆమె మరణించినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మరో బాలింత శివాని సైతం డెలివరీ అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు బలయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట, చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకుకదిలే ప్రస్తకే లేదని వెల్లడించారు. వైద్యాధికారులు ఏమన్నారంటే.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్ లేదని తెలిపారు. డెంగ్యూ ఉంటే తాము డెలివరీ చేయమని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశమన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్‌రేట్ పెరిగిందని, హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గాంధీకి తరలించామన్నారు. శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందన్నారు. చదవండి: పండుగ ప్రయాణం.. నరకయాతన -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి!
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్‌తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్‌ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదరాబాద్‌లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం) -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..
నల్లగొండ టౌన్: సాధారణ ప్రసవం పేరిట వైద్యులు చేసిన కాలయాపనకు ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్ర రక్త స్రావంతో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు శనివారం ఆస్పత్రి ఎదుట ఆందో ళనకు దిగారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు నిమిత్తం ఈ నెల 9న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. చదవండి: పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన హిజ్రాలు.. ఎందుకంటే? మూడు రోజులుగా ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా సాధారణ ప్రసవం పేరిట వైద్యులు కాలయాపన చేశారు. ఆపరేషన్ చేయకుండా ఈ నెల 11న నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఖిల కడుపును వైద్యులు బలంగా ఒత్తడంతో మగశిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కుటుంబసభ్యులు బాధితు రాలిని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వేడుకున్నా వైద్యులు అంగీకరించకుండా మూడు రోజులపాటు ఆమెకు రక్తం ఎక్కిస్తూ గడిపారు. అనంతరం పరిస్థితి విషమించి అఖిల కోమాలోకి వెళ్లడంతో వైద్యులు ఈ నెల 14న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ అఖిల పరిస్థితి మరింత విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతదేహంతో ఆందోళన: అఖిల మృతికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువు లు శనివారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా నార్మల్ డెలివరీ చేయడంతో గర్భసంచి పగిలిపోయి రక్తస్రావమైందని ఆరోపించారు. అఖిల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి, శిశువు సంరక్షణకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టూటౌన్ పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డాక్టర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం.. తల్లిని కోల్పోయిన పిల్లలు
తిరువొత్తియూరు: సేలం జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. దీంతో బంధువులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రికి సీలు వేశారు. వివరాల ప్రకారం.. జలగంఠాపురం సౌరియూర్ ప్రాంతానికి చెందిన భూపతి భార్య సంగీత (28). ఈ దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి 20 రోజులకు ముందు ఎడప్పాడిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చా రు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన సంగీతకు 2 వారాల తర్వాత తరచూ కడుపునొప్పి రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లా రు. డాక్టర్లు ఆమె కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ఆమెకు రెండవ సా రి ఆపరేషన్ చేశారు. తర్వా త ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న సంగీత ఆదివారం అస్వస్థతకు గురైంది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాగా అక్కడ మూడోసారి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం సంగీత ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సంగీత చనిపోయిందని ఆరోపిస్తూ.. బంధువులు రాత్రి ధర్నాకు దిగారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది లెనిన్ సంగీత మృతదేహాన్ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి -
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
సాక్షి, సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్‌కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌చేసిన డ్యుటీ డాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. -
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, నర్సంపేట (వరంగల్): వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: పెట్రోల్ బంకులో పనిచేసే యువతి.. మైనర్ బాలుడిని ట్రాప్ చేసి.. -
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే..
సాక్షి, మంచిర్యాల: డాక్టర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోదావరిఖనికి చెందిన కడారి అయిలమ్మ(65)ను అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఈనెల27న చేర్పించారు. నాలుగు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని కొంత చికిత్స అవసరమని అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం, సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆసుపత్రి వైద్యుడు రాత్రి మాత్రం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని పేర్కొన్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అయిలమ్మ కుటుంబ సభ్యులు వేరే చోట నుంచి సిలిండర్ తీసుకొచ్చారు. అయితే ఆక్సీమీటర్‌తో పాటు సిలిండర్ బిగించడానికి స్పానర్ కూడా ఆసుపత్రిలో లేవు. పరిస్థితి విషమించిన అయిలమ్మకు చికిత్స చేసేందుకు డాక్టర్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అయిలమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం; 3 రోజుల పసికందు మృతి..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం 3 రోజుల పసికందు మృతిచెందింది. ఆ వివరాలు.. పెద్ద కొడప్గల్ మండలం తక్కపల్లికి చెందిన ఓ మహిళ డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో అరుణ్, జయశ్రీ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. అయితే పాప పుట్టిన తర్వాత జాండీస్ రావడంతో వెంటిలేటర్ అవసరమైంది. అప్పటికే కుటుంబ సభ్యులు ఓ నెగిటివ్ బ్లడ్ రెండు బాటిళ్లు తీసుకొచ్చారు. ఈలోపే పాప కన్నుమూసింది. దీంతో వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మరణించిందని బంధులవులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: బీభత్సం.. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు! -
‘డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే ఫిర్యాదు’
సాక్షి, అనంతపురం: వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’) కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
సాక్షి, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్‌పై నుంచి కిందపడి మృతిచెందాడు. బెడ్‌పై నుంచే కిందపడటంతో ఆక్సిజన్ అందక ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి కిందపడి ఆక్సిజన్ అందక గిలగిలా కొట్టుకున్న సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని అదే వార్డులోని మరో పెషేంట్ ఫోన్ కాల్ ద్వారా బయటకు సమాచారం అందించాడు. అలాగే అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంపాడు. బాధితుడు బెడ్‌పై నుంచి కిందపడిన విషయాన్ని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని, అటువైపు కన్నెత్తి కూడా చూడ లేదని తెలిపాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధితుడు కిందపడి మృతిచెందిన తర్వాత.. మృతదేహాన్ని మంచంపైకి చేర్చి ఆక్సిజన్ పెట్టారని చెప్పారు. ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం
అమీర్‌పేట: కరోనా బూచి చూపి ఇతర రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తున్నారని, అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను సైతం వాయిదా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్–19 వార్డులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా కేటాయించి సేవలందిస్తున్నారు. మిగతా విభాగాల ద్వారా ఈఎస్ఐ కార్డు లబ్ధిదారులకు చికిత్సలు అందించాల్సి ఉండగా.. వైద్యులు, అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు నామమాత్రంగా సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి మందులతో సరిపెడుతూ కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఆనంద్‌కిషోర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కాలుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయలేమని, కొంత కాలం పాటు వాకర్ సాయంతో నడవాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వాకర్ కోసం ఆసుపత్రి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కిషోర్ వాపోయాడు. దీంతో బెడ్డుకే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పడుకుంటే ఆయాసం వస్తోందని, ఇటీవల ఆసుపత్రి వెళ్లగా బెల్టు పెట్టుకోవాలని సూచించారన్నారు. వాకర్ ఇవ్వాలని కోరితే సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఇక బెల్టు కోసం ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నాడు. 15 ఏళ్లుగా ఈఎస్ఐకి డబ్బులు కడుతున్నామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరిన తమకు సకాంలో వైద్యం ఇవ్వకుంటే కార్డు ఉండి లాభం ఏమిటని కిషోర్ వాపోయాడు. ఆసుపత్రికి వచ్చే అనేక మంది రోగులు ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బూచిని చూపి అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వేయిదా వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒక రోగి ఊపిరాడక మృతిచెందిన ఘటన అనంతపురం జీజీహెచ్‌లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. ధర్మవరానికి చెందిన రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా, వైద్యులు పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటలకు ఆసుపత్రికి వచ్చిన రాజుకు వైద్య చికిత్స సకాలంలో అందించకపోవడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు. -
చనిపోయారని చెప్పి చేతికిచ్చారు..
చింతూరు: పురిటి నొప్పులు ఆగకుండానే ఆ గర్భిణికి గుండె ఆగే మాట చెప్పారు.. పుట్టబోయే ఇద్దరు శిశువుల్లో ఒకరు చనిపోయారని అనడంతో ఆమె దుఃఖానికి అవధులు లేవు.. చివరికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఇద్దరూ చనిపోయారంటూ కవర్లో ఆ శిశువులను పెట్టి ఇవ్వడం మరింత కలచివేసింది.. కొన్ని గంటల తర్వాత ఆ కవర్లో ఓ శిశువు కదుతుందని బంధువులు చెప్పడంతో బతికి ఉన్నట్లు నిర్ధారించుకుని వైద్యానికి ఏర్పాట్లు చేశారు.. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ గర్భిణి బంధువులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం నరిసింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత, రవీందర్ దంపతులు. సునీత ఆరు నెలల గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో చింతూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడంతో శుక్రవారం రాత్రి అక్కడికి తరలించారు. ఆ ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన సిబ్బంది స్కానింగ్ తీయించాలని చెప్పడంతో స్కానింగ్ చేయించి వైద్యుడికి చూపించారు. దానిని పరిశీలించిన ఆయన కవల పిల్లల్లో ఓ బిడ్డ చనిపోయిందని శస్త్రచికిత్స చేసి చనిపోయిన బిడ్డను తీయకపోతే ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పడంతో గర్భిణి బంధువులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వైద్యుడు శస్త్రచికిత్స చేసిన చనిపోయిన ఆడబిడ్డతో పాటు, మరో మగబిడ్డను కూడా బయటకు తీసి ఇరువురు చనిపోయారంటూ కవర్లో పెట్టి ఇచ్చారని సునీత మామయ్య సింగయ్య తెలిపారు. సునీతకు డెలివరీ అనంతరం బాలింతలను ఉంచే వార్డులో ఉంచడంతో పాటు చనిపోయినట్లు చెప్పిన బిడ్డలను కూడా అక్కడే కవర్లో ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు సునీత బాబాయ్ సీతారామయ్య భోజనం తీసుకొచ్చి ఏం జరిగిందని అడగడంతో ఇద్దరు శిశువులు చనిపోయారని వైద్యులు చెప్పి కవరులో పెట్టి ఇచ్చారని చూపించింది. దీంతో ఆయన దగ్గరికి వెళ్లి కవర్లను చూడగా అందులో ఒక బిడ్డ కదలడంతో వెంటనే వైద్యులకు విషయం తెలిపారు. స్పందించిన వారు వెంటనే ఆ బిడ్డను హుటాహుటిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ వివరణ ఇస్తూ శుక్రవారం రాత్రి వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చారని, స్కానింగ్‌లో చనిపోయిన బిడ్డ ఉందని గుర్తించామన్నారు. బయట కూడా స్కానింగ్ చేయించాలని చెప్పామన్నారు. ఆ స్కానింగ్‌లో కూడా అలాగే ఉందని, దానివల్ల తల్లికి, మరో బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పి శనివారం ఉదయం డెలివరీ చేసి బయటకు తీశామన్నారు. మరో బిడ్డ పరిస్థితి కూడా బాగోక పోవడంతో ఆ బిడ్డను కూడా తీసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. పుట్టినప్పుడు రెండో బిడ్డకు శ్వాస లేదని, అంతేకాక శిశువు బరువు 500 గ్రాములు ఉండటంతో కష్టమని చెప్పి తమ సిబ్బంది వారికి సూచించారన్నారు. రెండో బిడ్డను వారు బయటకు తీసుకెళ్లారని, తిరిగి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయమనడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇద్దరూ చనిపోయారని అన్నారు ఉదయం 8 గంటలకు కాన్పు చేసి కవలలను తీశారు. ఇరువురూ చనిపోయారని చెప్పి కవర్లో పెట్టి ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. 12 గంటల సమయంలో నేను సునీతకు భోజనం తీసుకొని వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించడంతో కవర్లో ఉన్న శిశులను చూపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అందులో మగ శిశువు కదులుతుండటం గమనించి సిబ్బందికి తెలపడంతో వారు ఇంక్యూబేటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే. –కాకా సీతారామయ్య, సునీత బాబాయ్ -
వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి
సాక్షి, సిరిసిల్ల : వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. -
అధిక రక్తస్రావంతో బాలింత మృతి
వనస్థలిపురం: వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చిన తర్వాత అధిక రక్తస్రావంతో మృతి చెందింది. సరైన చికిత్స అందక వేరే ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్య, రక్తం ఎక్కించే సదుపాయాలు లేకపోవడంతో బాలింత మృతి చెందిందని ఆమె భర్త సతీష్ ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ములుగుకు చెందిన లెక్చరర్ సముద్రాల సతీష్ భార్య విజయ (29) రెండో కాన్పు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి హయత్‌నగర్‌లో తన సోదరి వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి 1.30 గంటలకు నొప్పులు రావడంతో ప్రైవేటు ఆసుపత్రులు నడవక పోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 4గంటల సమయంలో విజయ బాబుకు జన్మనిచ్చింది. కాగా విజయకు అధిక రక్తస్రావం అవుతుండడంతో 5గంటల సమయంలో ఆసుపత్రికి చెందిన అంబులెన్సులో నగరంలోని జడ్జీఖానా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ విజయ చికిత్స పొందుతు మృతిచెందింది. విజయ మృతితో రెండేళ్ల మొదటి కుమారుడు, అప్పుడే పుట్టిన బాబు తల్లి లేని పిల్లలు అయ్యారని బంధువులు వాపోతున్నారు. జాండీస్, బ్లీడింగ్‌తోనే మృతి... విజయకు నార్మల్ డెలివరీ అయ్యింది. కాగా ఆమె జ్వరం, జాండీస్‌తో బాధ పడుతోంది. డెలివరీ అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం జడ్జిఖానా ఆసుపత్రికి పంపించాం. అక్కడ చికిత్స పొందుతు విజయ మృతి చెందింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదు. – సూపరిండెండెంట్ హరిప్రియ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం... ఏరియా ఆసుపత్రిలో రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం. ప్రసవం సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే విజయ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, ఖమ్మం: వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన దారా అఖిల గత నెల 18న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో 19న ఎన్నెస్టీ రోడ్‌లోని జనని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పాపకు వైద్య సేవలు అందించారు. 18 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రెండు రోజుల కే శిశువుకు జ్వరం రావటంతో మంగళవారం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మందులు రాసిచ్చి పంపారు. బుధవారం శిశువు ఆరోగ్యం మరింత దిగజారటంతో మళ్లీ శిశువును జనని ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన వైద్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటంతో.. నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్లి చూపించారు. వైద్య సేవలు పొందుతూ అక్కడే శిశువు మృతి చెందింది. శిశువు మృతికి జనని ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. పాప పరిస్థితి గురించి రోజూ వైద్యుడిని వివరాలు అడుగుతున్నప్పటికీ ఏమీ చెప్పకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తామని అడిగినా వినకుండా ఇక్కడే ఉంచి ప్రాణాన్ని బలిగొన్నారని కన్నీరుమున్నీరై విలపించారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం, శిశువు బంధువులతో చర్చలు జరిపింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి!
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో వైద్యుల నిర్లక్ష్యానికి మరో యువకుడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం సరైన వ్యాధి నిర్ధారణ జరగక, సకాలంలో వైద్యం అందక ఒకరు మృతి చెందిన విషయం విదితమే. తాజాగా మరో యువకుడు సరైన చికిత్స అందక తనువు చాలించాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన కేశాలు, రూతమ్మలకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడైన చక్రవర్తి(20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వ్యక్తిగత కారణాలతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమిస్తుండటంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన అతనికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మేల్ మెడికల్(ఎంఎం)–7 వార్డులో అడ్మిట్ చేశారు. వాస్తవంగా ఇలా క్రిమిసంహారక మందు తాగిన వారిని వార్డులో గాకుండా ముందుగా ఏఎంసీ విభాగానికి తరలిస్తారు. కానీ వైద్యులు వార్డుకు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. వెంటనే క్యాజువాలిటీకి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో క్యాజువాలిటీలో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. వార్డుకు గాకుండా ఏఎంసీ విభాగానికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం అందించి ఉంటే తమ కుమారుడు బతికేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
హిజ్రాకు చికిత్స చేసేందుకు డాక్టర్ల నిరాకరణ
చెన్నై,తిరుత్తణి: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హిజ్రాకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ వైద్యులు నిరాకరించిన ఘటన తిరుత్తణి ప్ర భుత్వాస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. తిరుత్తణి పెరియార్‌నగర్‌కు చెందిన కావ్య(40) అనే హిజ్రాకు జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు రావడంతో చికిత్స కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే హిజ్రాకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. సుమారు 2 గంటల పాటు అనా రోగ్యంతో బాధపడుతున్నా కనీసం వైద్యులు పలకరించేందుకు సైతం ముందుకు రాకపోవడంతో తోటి హిజ్రాలు ఎందుకు వైద్యం చేయరని ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రాధికను ప్రశ్నిం చారు. వారి ప్రశ్నలను డాక్టర్ పట్టించుకోకపోవడంతో హిజ్రాలు ఆస్పత్రి ప్రాంగణం వద్ద బైఠాయించారు. అక్కడికి వచ్చిన తిరువళ్లూరు జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర దయాళన్‌కు సమస్యను వివరించారు. చివరకు జాయింట్ డైరెక్టర్ ఆదేశాలతో వైద్యులు హిజ్రాకు చికిత్స చేశారు. -
ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.... ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం డోర్‌పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్లేట్స్ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూ. 2లక్షలకు ఒప్పందం... విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది. 16గంటల పాటు పోలీస్ పహారా.... ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సర్వజనాస్పలో మృతి చెందాడు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు తారికి తీసింది. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ధర్మవరం పట్టణానికి చెందిన కె.శ్రీనివాస్ (20) ఈ నెల నాలుగో తేదీన విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సత్యనారాయణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినపుడు అతడి పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి 9.54 గంటలకు సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు మల్లి, నారాయణస్వామి, వెంకటేశ్‌లు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌కు తెలియజేశారు. ఇంతకుముందే చికిత్స మొదలు పెట్టామని, ఏమీ కాదులే అని డాక్టర్ సమాధానమిచ్చారు. అర్ధరాత్రి దాటాక 12.05 గంటల సమయంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్‌ను దుర్భాషలాడారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మృతదేహాన్ని బెడ్‌పై నుంచి తీయకుండా నిరసన తెలిపారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్ఐలు త్రిలోక్, రాము సర్తి చెప్పడంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. వైద్యుడిని నిలదీసిన బంధువులు యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావులు డ్యూటీ డాక్టర్ రమేష్‌కు సూచించారు. డాక్టర్ రమేష్ మెడిసిన్ వార్డు నుంచి ఆర్థో వార్డు వైపుగా వస్తున్నాడు. ఆ సమయంలో మృతుని కుటుంబీకులు ఒక్కసారిగా వైద్యున్ని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడంటూ మండిపడ్డారు. చివరకు సెక్యూరిటీ మధ్య డాక్టర్ రమేష్‌ను సూపరింటెండెంట్ చాంబర్‌కు తీసుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్‌ను విధుల నుంచి తొలగించాలంటూ మృతుని కుటుంబీకులు సూపరింటెండెంట్ చాంబర్ ముందు బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రే మెరుగైన వైద్య సేవలందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. విషపుద్రావకం చాలా ప్రమాదకరమని, తమవైపు నుంచి అందించాల్సిన వైద్య సేవలందించామని డాక్టర్ రమేష్ తెలిపారు. వీరి సమాధానంతో సంతృప్తి చెందని మృతుని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. చివరకు ఎస్ఐ లింగన్న, ఏఎస్ఐ రాము వారిని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ వద్దకు తీసుకెళ్లారు. విచారణకు ఆదేశం శ్రీనివాస్ మృతిపై ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల విభాగం, అనస్తీషియా, ఈఎన్టీ హెచ్ఓడీలు 24 గంటల్లోగా విచారణ చేయాలని సూచించారు. డాక్టర్ రమేష్‌కు మెమో జారీ చేశారు. ఉద్యోగాలు చేయలేం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పట్ల మృతుని కుటుంబీకులు వ్యవహరించిన తీరును ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది తప్పుబడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వైద్యున్ని దేవునిగా పోల్చుతారని, అటువంటిది వైద్యునిపై దాడికి యత్నించడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడడమేంటని వాపోతున్నారు. ప్రాణం పోయాలని చూస్తామే కానీ.. తీయాలని ఎవరికీ ఉండదని పేర్కొన్నారు. తమ తప్పు లేకపోయినా దూషిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసి.. ‘బీ పాజిటివ్’ అంటున్నారు
అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్.అక్తర్‌భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌నే బురిడీ కొట్టించేందుకు వైద్యుల బృందం యత్నించింది. సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఈ నెల 27న బాలింత ఎస్.అక్తర్‌భాను మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సి ఉండగా.. బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మరణించింది. ఈ విషయమై ‘ఆస్పత్రి నిర్లక్ష్యం–బాలింత మృతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కాగా.. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. బాలింత మృతికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణలో భాగంగా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్‌తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఘటనపై పక్కా నివేదిక ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు, పెథాలజిస్టులు మృతురాలు అక్తర్‌భాను బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ అని రాసి ఉన్న రికార్డులను కలెక్టర్‌కు చూపించారు. అంతేకాకుండా వేరొకరి రక్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ సమక్షంలో బీ పాజిటివ్‌గా నిర్థారణ చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించని కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి పి.ప్రశాంతిని విచారణ అధికారిగా నియమించగా, వారు సుదీర్ఘంగా విచారించి మృతురాలి బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ కాగా.. బీ పాజిటివ్ రక్తం ఎక్కించినట్టు గుర్తించారు. గైనిక్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలింత మరణించినట్టు నిర్థారణకు వచ్చారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుకుంటారు. డీఎంహెచ్ఓ చొరవతో వెలుగులోకి.. ఈ నెల 26న ఇతర రక్త పరీక్షల కోసం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాలింత బ్లడ్ శ్యాంపిల్స్‌ను రాయలసీమ డయాగ్నొస్టిక్కు పంపారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ పలుమార్లు పెథాలజిస్టుతో బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయించగా అసలు నిజం వెలుగు చూసింది.