
నిలోఫర్‌లో మరణమృదంగం
► వారం రోజుల్లో పది మంది బాలింతలు మృతి
► ఆపరేషన్ థియేటర్లపై మృతుల బంధువుల దాడి
► మూడు రోజుల నుంచి ఓటీలు బంద్
► నేడు అన్ని విభాగాధిపతులతో అత్యవసర సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. మందుల్లో నాణత్యా లోపం, ఆపరేషన్ థియేటర్లలోని ఇన్‌ఫెక్షన్‌తో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల కేవలం వారం రోజుల్లో ఇక్కడ పది మంది బాలింతలు మృతి చెందినట్లు సమాచారం.
ఈ మరణాలపై బాలింతల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మృతురాలికి సంబంధించిన బంధువులు ఏకంగా ఆపరేషన్ థియేటర్‌పై దాడికి దిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం మరో ఇద్దరు బాలింతలను చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించగా వారు అక్కడ కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి యంత్రాంగం జాగ్రత్త పడుతోంది. అత్యవసర ప్రసవాలు మినహా మిగిలన వాటన్నింటినీ నిలిపివేసింది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
పొట్టలో దూది పెట్టి కుట్టిన వైద్యులు
ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బాలింతలు మత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేశారు. ప్రసవ సమయంలో అవుతున్న రక్తస్త్రావాన్ని తూడ్చేందుకు ఉపయోగించే దూది బట్టను కడపులో అలాగే పెట్టి కుట్టేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాధితురాలిని చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించారు. తీరా అక్కడి వైద్యులు స్కానింగ్ నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లే ఇలా జరిగిందని తేలింది. ఉదయం సిజేరియన్ చేసిన బాలింతల్లో రోజుకు సగటున ఒకరికి మధ్యాహ్నం మరోసారి సర్జరీ చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటిండెంట్ సురేష్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా గైనిక్ వార్డులో అసలే సిబ్బంది కొరత ఉంది. దీనికితోడు యూనిట్ 1, యూనిట్–2కు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు లాంగ్‌లీవులో విదేశాలకు వెళ్లారు. పీజీ విద్యార్థుల వల్ల సిజేరియన్లు చేయించడం, డెలివరి అనంతరం బాలింతలకు వేస్తున్న ఇంజెక్షన్లు వికటించడం వల్ల మృతులు పెరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.