Niloufer Hospital: నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం | Police Rescued Kidnapped Baby From Niloufer Hospital Near Kurnool, More Details Inside | Sakshi
Sakshi News home page

Niloufer Hospital: నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం

Published Mon, Nov 25 2024 7:37 AM | Last Updated on Mon, Nov 25 2024 10:31 AM

Police Rescue Niloufer Hospital Kidnapped Baby Near Kurnool

ముగ్గురి రిమాండ్‌  చిన్నారిని అనంతపురం జిల్లాకు 

తరలించేందుకు యత్నం  పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద నిందితుల పట్టివేత 

 క్షేమంగా తల్లి చెంతకు చేరిన శిశువు

కీలకంగా మారిన సీసీ కెమెరా పుటేజీ   

నాంపల్లి: నిలోఫర్‌ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఆచూకీ లభించింది. శిశువును అపహరించి ఏపీలోని అనంతపురం జిల్లాకు తరలిస్తుండగా జాతీయ రహదారి 44పై గద్వాల జిల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్‌ బాష దంపతులకు  నెల రోజుల క్రితం జహీరాబాదు ఏరియా ఆసుపత్రిలో మగ శిశువు జని్మంచాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు గత నెల 20న శిశువును  నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. 

నెల రోజుల పాటు నిలోఫర్‌లో చికిత్స పొందిన శిశువును శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి చేసే  ముందు శిశువు తల్లి,  అమ్మమ్మ ఆరోగ్య శ్రీ వార్డుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచి్చన బుర్ఖా ధరించిన గుర్తు తెలియని మహిళ వృద్ధురాలితో మాటలు కలిపి తాను ఇక్కడే పనిచేస్తానంటూ  చెప్పింది. చిన్నారి ముద్దుగా ఉన్నాడంటూ చేతిలో తీసుకుని వృద్ధురాలి దృష్టి మరల్చి శిశువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో శిశువు తల్లి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు  ఐదు బృందాలుగా రంగంలో దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్‌ ఆచూకీని గుర్తించి వెంటాడారు.  

వారసుడి కోసమే...  
అనంతపురం జిల్లా, ముదిగుబ్బ కు చెందిన షాహీన్‌ బేగం, మేకల చెరువు ప్రాంతానికి చెందిన  అబ్దుల్లా అలియాస్‌ వెంకటే‹Ù, అతడి భార్య  రేష్మ అలియాస్‌ రేణుక ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి ఫస్ట్‌లాన్సర్‌లో ఉంటున్నారు.  అబ్దుల్లా, రేష్మలకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేష్మ ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన వారు మగశిశువును తెచ్చుకుని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను నిలోఫర్‌ ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయంగా ఉండేందుకు రేష్మ తన  సోదరి షాహీన్‌ బేగంను హైదరాబాదుకు రప్పించింది. పథకం ప్రకారం గర్భంతో ఉన్న రేష్మ చికిత్స కోసం నిలోఫర్‌కు వచి్చనట్లుగా నటించారు. ఆమెకు సహయకురాలిగా షాహీన్‌ బేగం ఉంది. అబ్దుల్లా అలియాస్‌ వెంకటేష్‌ ఆసుపత్రి వద్ద వేచి ఉంది. షాహీన్‌ బేగం ఆసుపత్రిలో నుంచి మగ శిశువుతో బయటికి వస్తున్న వృద్ధురాలు( శిశువు అమ్మమ్మ) దగ్గరకు వెళ్లి ఆమె  దృష్టి మరల్చి వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుని ఆటోలో అక్కడి నుంచి పారిపోయింది.  

సీసీ కెమెరాలే పట్టించాయి... 
నిందితులను పట్టుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. నిలోఫర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సీసీ పుటేజీల్లో లభించిన ఆధారాల ప్రకారం.. ఆటోలో నుంచి నిందితులు బైక్‌పైకి మారారు. మాసాబ్‌ ట్యాంక్‌ నుంచి ఎన్‌హెచ్‌–44 హైవేపైకి చేరుకున్న తర్వాత వారు మారుతీ ఓమ్నీ వాహనంలోనికి షిప్టు అయ్యారు. మెహిదీపట్నం మీదుగా బైక్‌ కర్నూల్‌ హైవే రోడ్డు వైపు వెళ్తుండగా గమనించిన మధ్య మండలం డీసీపీ గద్వాల్‌ ఎస్పీకి సమాచారం అందించారు.  ఆయన మానవపాడు, ఉండవల్లి పీఎస్‌లను అప్రమత్తం చేశారు. పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ఎస్సైలు పుట్టా మహేష్‌ గౌడ్, ఎస్సై చంద్రకాంత్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్న మగ శిశువు, నిలోఫర్‌లో కిడ్నాప్‌నకు గురైన శిశువు ఒక్కటేనని ధృవీకరించుకున్న తర్వాత శిశువును విచారణాధికారిగా ఉన్న నాంపల్లి ఎస్సై సాయి కుమార్‌కు  అప్పగించారు. నిందితులను అరెస్ట్‌ చేసి జ్యుడీíÙయల్‌ కస్టడీకి తరలించారు. కిడ్నాప్‌ కేసును చేధించిన నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు, డీఐ ఎం.సైదేశ్వర్, సైఫాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రాఘవేందర్, ఎస్సైలు సాయి కుమార్, డి.శాంతికుమార్, పి.ప్రదీప్, కానిస్టేబుల్స్‌ నాగరాజు, సాగర్, రవి వర్మ, దీపక్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.  

సం‘జాయ్‌’కుమార్‌! 
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు ఆర్‌.సంజయ్‌కుమార్‌. మొదటి ఫొటో ఆయన నాంపల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన 2017 అక్టోబర్‌ నాటిదైతే.. రెండోది సైఫాబాద్‌ ఏసీపీగా (నాంపల్లి ఠాణా కూడా ఈ డివిజన్‌లోనిదే) ఉండగా ఆదివారం (24 నవంబర్‌ 2024) తీసింది. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిన్నారుల కిడ్నాప్‌ ఉదంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. నిలోఫర్‌ ఆస్పత్రి, పబ్లిక్‌గార్డెన్స్, నాంపల్లి రైల్వేస్టేషన్‌ తదితరాలు దీని పరిధిలో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సంజయ్‌కుమార్‌ ఆ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్న తల్లి ఒడి నుంచి కిడ్నాపైన ఫయాజ్‌ ఖాన్‌ను (4 నెలలు) 15 గంటల్లో కాపాడారు. శనివారం నిలోఫర్‌ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన నెల రోజుల వయసున్న బాబును ఆదివారం తల్లి ఒడికి చేర్చారు. రెండు సందర్భాల్లోనూ తల్లి చేతికి చిన్నారులను అందిస్తుండగా కెమెరా కళ్లకు చిక్కిన అరుదైన దృశ్యాలివీ. 2017 నాటి ఫొటో అప్పట్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో మీడియాను ఆకర్షించింది.  

నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement